ప్రైవేటిక‌ర‌ణ‌కు ఒప్పుకోం : కేర‌ళ సీఎం

20 Aug, 2020 15:21 IST|Sakshi

తిరువ‌నంత‌పురం :  కేంద్ర కేబినెట్‌ మూడు విమానాశ్రయాలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో(పీపీపీ) లీజుకు ఇచ్చేందుకు ఆమోదం తెల‌ప‌డాన్ని రాష్ర్ట  ప్రభుత్వం ఖండించింది. తిరువ‌నంత‌పురం విమానాశ్ర‌యంతో పాటు మ‌రో మూడు విమానాశ్ర‌యాల నిర్వ‌హ‌ణ హ‌క్కుల‌ను ఓ ప్రైవేటు సంస్థ‌కు అప్ప‌గించాల‌ని కేంద్రం తీసుకున్న నిర్ణ‌యంపై కేర‌ళ ప్ర‌భుత్వం అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. విమానాశ్ర‌య కార్య‌క‌లాపాలు, నిర్వాహ‌ణ‌ను స్పెష‌ల్ ప‌ర్ప‌స్ వెహికిల్ ( ఎస్పీవీ) కి బదిలీ చేయాలని కేరళ పదేపదే చేసిన చేసిన అభ్యర్థనలను  పట్టించుకోలేదని ముఖ్య‌మంత్రి పినరయి విజయన్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.  రాష్ర్ట ప్ర‌భుత్వం ప్ర‌ధాన వాటాదారుగా ఉన్న ఎస్పీవీకి తిరువ‌నంత‌పురం విమానాశ్ర‌య నిర్వాహ‌ణ బాధ్య‌త‌ల‌ను త‌మ‌కు అప్ప‌గిస్తామ‌ని  2003లో ఇచ్చిన హామీని కేంద్రం తుంగ‌లో తొక్కింద‌ని ఆరోపించారు. విమానాశ్ర‌య అభివృద్ధికి రాష్ర్ట ప్ర‌భుత్వం చేసిన కృషిని  విస్మ‌రించింద‌న్నారు.  కేంద్రం తీసుకున్న ఏక‌ప‌క్షంగా ఉంద‌ని, దీన్ని తాము వ్య‌తిరేకిస్తున్నామ‌ని పేర్కొన్నారు.  (ఆ ఆరు ఎయిర్‌పోర్టుల ప్రైవేటీకరణ)

దేశంలో ఆరు విమానాశ్రయాలను ప్రైవేటీకరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.  వీటిలో  జైపూర్, తిరువనంతపురం, గువాహటి విమానాశ్రయాలు కాగా, వీటి నిర్వహణ హక్కులను అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ బిడ్‌ రూపంలో గతేడాది గెలుచుకుంది. ఈ మూడింటితోపాటు లక్నో, అహ్మదాబాద్, మంగళూరు విమానాశ్రయాలను కూడా 2019 ఫిబ్రవరిలో అదానీ దక్కించుకుంది. ఈ ఆరింటిలో అహ్మదాబాద్, మంగళూరు, లక్నో విమానాశ్రయాలను అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు లీజుకు ఇచ్చేందుకు అనుకూలంగా 2019 జూలైలోనే కేంద్రం ఆమోదం తెలిపింది. మిగిలిన మూడు విమానాశ్రయాలనూ పీపీపీ విధానంలో లీజునకు తాజాగా ఆమోదముద్ర వేసింది. 50 ఏళ్ల నిర్వహణ తర్వాత  ఆయా విమానాశ్రయాలను ఏఏఐకి తిరిగి ఇచ్చేయాల‌ని తెలిపింది. విమానాశ్ర‌యాల‌ను ప్రైవేటుకు లీజుకు ఇస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణ‌యాన్ని తిరువ‌నంత‌పురం కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్వాగతించారు. బిజెపి ఎంపి వి మురళీధరన్ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ట్వీట్ చేశారు. (అదానీ చేతికి మరో మూడు విమానాశ్రయాలు)


 

మరిన్ని వార్తలు