కోళీకోడ్‌ ఘటన: హోం క్వారంటైన్‌లోకి సీఎం

14 Aug, 2020 21:14 IST|Sakshi

తిరువనంతపురం: కేరళ కోళీకోడ్‌ విమాన ప్రమాదం సహాయక చర్యల్లో పాల్గొన్న 22 మంది అధికారులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మలప్పురం జిల్లా వైద్యాధికారి వెల్లడించారు. వీరిలో జిల్లా క‌లెక్టర్‌తో పాటు పలువురు అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రమాద స్థలాన్ని సందర్శించిన అధికారుల్లోనూ పలువురు కరోనా బారినపడ్డట్లు తెలిసింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. సీఎం వెంట జిల్లా కలెక్టర్, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. అధికారులకు కరోనా సోకిన విషయం తెలియగానే సీఎం విజయన్‌తో పాటు ప్రమాద స్థలాన్ని సందర్శించిన అధికారులు హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. (కోళీకోడ్‌ ఘటన: 22 మంది అధికారులకు కరోనా)
 

ముఖ్యమంత్రి విజయన్‌తో పాటు ఆయన వెంట ఉన్న అధికారులు క్వారంటైన్‌లో ఉంటారని సీఎం కార్యాలయం శుక్రవారం తెలిపింది. ఈ నేపథ్యంలో శనివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సహకార, దేవాదాయ శాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ జాతీయ జెండాను ఎగురవేస్తారని పేర్కొంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను దుబాయ్ నుంచి స్వదేశానికి తరలిస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్యాసింజర్ విమానానికి జరిగిన ప్రమాదంలో ఇద్దరు పైలట్లు వింగ్ కమాండర్ దీపక్‌ వసంత్‌ సాథే, కెప్టెన్ అఖిలేష్ కుమార్ సహా 18 మంది  మరణించారు.

>
మరిన్ని వార్తలు