మద్యం షాపు వద్దే వివాహం.. కారణం అదే!

6 Jul, 2021 19:45 IST|Sakshi

తిరువనంతపురం: సాధారణంగా చాలా జంటలు తమ పెళ్లి వేడుకను కళ్యాణ మండపంలో గానీ గుడిలో గానీ చేసుకోవడానికి ఇష్టపడతారన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ జంట కాస్త వెరైటీగా ఆలోచించారు. తమ వివాహ వేడుకను వైన్‌షాపు ముందర చేసుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. వివరాలు.. ఈ సంఘటన కేరళలోని కోజికోడ్‌లో  చోటుచేసుకుంది. అయితే, కోజికోడ్‌కు చెందిన ప్రమోద్‌, ధన్యాలు మద్యం దుకాణం ముందు దండలు మార్చుకుని ఒక్కటయ్యారు. వీరిద్దరు గత కొంత కాలంగా క్యాటరింగ్‌ వ్యాపారం చేస్తున్నారు.

కేరళ ప్రభుత్వం కరోనా మహమ్మారి కారణంగా వివాహ వేడుకలకు 50 మందికి మాత్రమే అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కొన్ని నెలలుగా తాము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రమోద్‌, ధన్యాలు తెలిపారు. అందుకే తాము, ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఈ విధంగా మద్యం దుకాణం ముందు పెళ్లి చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ వేడుకలో పాల్గొన్న కోజికోడ్‌ ఎంపీ ఎంకె రాఘవన్‌ ప్రభుత్వ తీరుపై మండి పడ్డారు. మద్యం షాపుల దగ్గర,లిక్కర్‌ కోసం వందల మంది ఎగబడుతున్నారని విమర్షించారు. అయితే, అక్కడ పాటించని కరోనా నిబంధనలు వివాహ వేడుకలకు ఎందుకని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం క్యాటరర్స్‌ను ఆదుకోవాలని కోరారు.

ప్రస్తుతం, తాజా సడలింపులలో భాగంగా పెళ్లి వేడుకలకు 100 మంది పాల్గొనేలా అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కేరళలో దాదాపు, 2000 కుటుంబాలు క్యాటరింగ్‌ వ్యాపారంపై ఆధారపడ్డాయి. వీరందరు పెళ్లిళ్లకు ఆహారాన్నిసప్లైచేస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నాయి. కాగా, గత కొంత కాలంగా వీరికి ఎలాంటి ఆర్డర్‌లు లేక తీవ్రంగా నష్టపోతున్నామని కేరళ క్యాటరర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ప్రేమ్‌ చంద్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 

అయితే, ఈ పోస్ట్‌ కాస్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘పాపం.. వారిని ఆదుకోవాలి..’, ‘భలే ఉంది.. మీ ఐడియా..’, ‘ జాగ్రత్త సుమా.. తాగుబోతులు పక్కనే ఉన్నారు..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

మరిన్ని వార్తలు