Kerala: కరోనా విజృంభణ, కీలక నిర్ణయం

28 Aug, 2021 19:13 IST|Sakshi

సోమవారం నుంచి రాత్రి కర్ఫ్యూ

రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటలకు వరకు ఆంక్షలు

తిరువనంతపురం: కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా కేరళ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 30, సోమవారం నుంచి నైట్‌  కర్ఫ్యూ అమలు చేయనుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటలకు వరకు ఆంక్షలు అమలు కానున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. మరోవైపు రోజువారీ కేసులు  పెరగడంతో రాష్ట్రంలో ఆదివారం లాక్‌డౌన్‌ తిరిగి అమలు చేయాలని  ప్రభుత్వం నిర్ణయించింది. స్వాతంత్ర్య దినోత్సవం  ఓనం వేడుకల కారణంగా గత రెండు వారాల్లో ఆదివారం లాక్‌డౌన్‌కు కేరళ ప్రభుత్వం మినహాయింపునిచ్చిన సంగతి తెలిసిందే.

కాగా కేరళలో కరోనా మోగిస్తున్న డేంజర్‌ బెల్స్‌, మహమ్మారి థర్డ్ వేవ్ ఆందోళనను మరింత తీవ్రం చేస్తున్నాయి. ఓనం పండుగ వేడుకల తర్వాత కేసుల పెరుగుదల ప్రమాదకరంగా పరిణమించింది. వరుసగా మూడవ రోజు కూడా 30 వేల మార్క్‌ దాటి,  శుక్రవారం 32,801 కొత్త కేసులను నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా  కోవిడ్-19 కేసుల సంఖ్యం క్రమంగా మళ్లీ పుంజుకుటోంది. 

ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో రోజువారీ కోవిడ్ పాజిటివ్‌ కేసులు నాలుగు శాతానికి పైగా పెరిగి శనివారం 46,759 కొత్త కేసులతో రెండు నెలల గరిష్టాన్ని తాకాయి. గత 24 గంటల్లో 509 మరణాలు సంభవించాయి. అటు ఢిల్లీ,ముంబై, కర్ణాటక, హరియాణాలో కూడా కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. 

మరిన్ని వార్తలు