ఫుట్‌బాల్ చూసేందుకు రూ.లక్షలు పెట్టి ఇల్లు కొన్న ఫ్యామిలీ.. ఎటు చూసినా మెస్సీ, రొనాల్డో ఫొటోలే..

22 Nov, 2022 15:45 IST|Sakshi

తిరువనంతపురం: అవును.. మీరు చదివింది నిజమే. అందరూ కలిసి ఒక్కచోట ఫుట్‌బాల్‌ చూసేందుకు ఏకంగా రూ.23 లక్షలు పెట్టి ఇల్లు కొనుగోలు చేశారు. కేరళలోని కొచ్చి జిల్లాలో ఉన్న ముందక్కముగల్‌ గ్రామంలో 17 మంది ఫుట్‌బాల్‌ ప్రేమికులు ఈ క్రేజీ పని చేశారు. ఖతర్‌లో ఫిఫా వరల్డ్‌ కప్‌ జరుగుతున్న విషయం తెలిసిందే కదా! అయితే వీళ్లంతా 20 ఏళ్లుగా ఫుట్‌బాల్‌ ఆటను కలిసి చూస్తున్నారు. ప్రతిసారి ఎవరో ఒకరి ఇంటి దగ్గర చూసేవారు.

ఆ సందర్భంగా ఉండే హడావుడి అంతాఇంతాకాదు. వీళ్ల గోలతో కుటుంబ సభ్యులు ఇబ్బంది పడిన ఘటనలు అనేకం. ఇక అవేం ఉండొద్దనుకుని ఏకంగా ఇల్లు కొనేశారు. దాన్ని బ్రెజిల్, అర్జెంటీనా, పోర్చుగల్‌ రంగులతో నింపేశారు. ఫిఫా జెండాలను కట్టారు. ఫుట్‌బాల్‌ లెజెండరీ ప్లేయర్స్‌ లియోనల్‌ మెస్సీ, క్రిస్టియానా రొనాల్డో ఇతర ఆటగాళ్ల ఫొటోలతో ఇంటిని అలంకరించారు. ఆట చూడటానికి పెద్ద స్క్రీన్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. తమ తరువాతి తరాలు కూడా కలిసిమెలిసి ఉండాలని, మా స్నేహాన్ని కొనసాగించాలని ఈ ఏర్పాటు చేసినట్లు బృంద సభ్యుల్లో ఒకరైన షెఫీర్‌ తెలిపారు. ఫుట్‌బాల్‌ ప్రేమికులంతా వచ్చి మ్యాచ్‌ చూడొచ్చంటున్నారు.
చదవండి: పసిపిల్లలపై మీజిల్స్‌ పంజా.. వ్యాధి లక్షణాలివే...

మరిన్ని వార్తలు