రూ. 9 లక్షల లోన్‌ కట్టాలని బ్యాంక్‌ నోటీస్‌.. గంటల్లోనే అదృష్టం తలుపు తట్టింది

14 Oct, 2022 19:56 IST|Sakshi

తిరువనంతపురం: అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో చెప్పలేం. అదృష్టం కలిసొచ్చి రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోతుంటారు.  కేరళలో ఓ వ్యక్తికి ఇలాగే జరిగింది. అయితే అతనికి కష్టం, అదృష్టం ఒకేసారి వచ్చి ఉక్కిరిబిక్కిరి చేశాయి. అప్పుల్లో కూరుకుపోయి బాధపడుతున్న అతడ్ని అదృష్టం వరించి లక్షాధికారిని చేసింది. వివరాలు.. కొల్లాం జిల్లా మినగపల్లికి చెందిన ఓ మత్స్యకారుడికి భార్య, పిల్లలు ఉన్నారు. 

అవసరాల నిమిత్తం ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టి రూ. 9 లక్షలు లోన్ తీసుకున్నాడు. కొన్ని కారణాల వల్ల అది తీర్చలేకపోయాడు. అక్టోబర్‌ 12న చేపలు పట్టుకునేందుకు వెళ్తుండగా ప్రభుత్వానికి చెందిన అక్షయ లాటరీ రూ.70 లక్షల విలువైన టికెట్‌ కొనుగోలు చేశాడు. తిరిగి మధ్యాహ్నం ఇంటికి వచ్చే సరికి అతనికి బ్యాంక్‌ నుంచి నోటీస్‌ వచ్చింది. ఇంటిని తాకట్టు పెట్టి తీసుకున్న లోన్‌ డబ్బులు రూ.9 లక్షలు కట్టాలని బ్యాంక్‌ నోటీసులు పంపించింది. లేకుంటే ఇంటిని స్వాధీనం చేసుకుంటామని అందులో పేర్కొంది. బ్యాంక్‌ నోటీసులు చూసిన మత్స్యకారుడు తీవ్ర కుంగుబాటుకి లోనయ్యాడు. ఏం చేయాలో.. లోన్‌ డబ్బులు ఎలా కట్టాలో తెలియక తల పట్టుకున్నాడు. చివరికి ఇంటిని అమ్మి అయినా లోన్‌ కట్టాలని నిర్ణయించుకున్నాడు.
చదవండి: లేడీ రజనీకాంత్‌.. సూపర్‌ టాలెంట్‌.. ‘వైరస్‌’ను గుర్తు చేసింది!

అంతలోనే ఆ కుటుంబంలో ఆనందాలు వెల్లువిరిశాయి. నోటీసులు అందుకున్న కొన్ని గంటల్లోనే అక్షయ లాటరీ టికెట్‌ దక్కినట్లు కాల్‌ వచ్చింది. రూ. 70 లక్షల విలువైన మొదటి బహుమతి గెలుచుకున్నట్లు చెప్పారు. దీంతో పీకల్లోతు అప్పుల్లో ఉన్న మత్య్సకారుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. లాటరీ డబ్బుల గురించి మాట్లాడుతూ.. ముందుగా ఇంటి లోన్‌ను తీర్చనున్నట్లు తెలిపారు. అలాగే తమ పిల్లలకు మంచి చదువులు అందించి వారిని గొప్ప స్థాయిలో నిలబెట్టాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
చదవండి: వాట్సాప్‌లో మహిళా పోలీసులకు ప్రైవేటు ఫోటోలు.. చిక్కుల్లో డీఎస్పీ

మరిన్ని వార్తలు