Kerala: సర్కార్‌ కీలక నిర్ణయం.. ఆ ఉద్యోగులంతా ఇకపై

26 Jul, 2021 17:02 IST|Sakshi

Dowry.. సమాజంలో ఎన్నో అవరోధాలను కలిగిస్తోంది. తల్లిదండ్రులకు ఆడ పిల్ల పుడితే లక్షల కట్నాలు ఎక్కడ ఇవ్వాలని పురిట్లోనే ఆడపిల్లలను చంపేసిన ఘటనలు కోకొల్లలు. అయితే కాలం మారింది. కాలంతో పాటు సమాజంలో కట్టుబాట్లు, ఆచారాలు మారుతున్నాయి. ఆడ పిల్లలు తమకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటున్నారు. అది కూడా కట్నాలకు ఆశ పడని వాడికే తమ మనసు సొంతం అంటున్నారు. 

తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం వరకట్నానికి వ్యతిరేకంగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేరళ ప్రభుత్వంలో పని చేస్తున్న వివాహం కాని పురుష ఉద్యోగులు తాము వరకట్నాన్ని ప్రొత్సహించడం లేదా తీసుకోకూడదని స్పష్టం చేసింది. అంతేకాకుండా పెళ్లైన నెల రోజుల్లో తాము పని చేస్తున్న విభాగం అధిపతులకు డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ డిక్లరేషన్‌లో భార్య సంతకంతో పాటు వధువు, వరుడిల తండ్రి సంతకం ఉండాలని పేర్కొంది. మహిళ, శిశు సంక్షేమ శాఖ కొద్దిరోజుల క్రితం ఈ సర్క్యులర్ జారీ చేసింది.

ప్రభుత్వంతో పాటు ప్రైవేటు, అటానమస్, ఇతర సంస్థలకు సంబంధించిన విభాగాల అధిపతులు సైతం ఈ మేరకు డిక్లరేషన్లు తీసుకోవాలని తెలిపింది. ఇక కేరళలో ప్రతి ఏడాది నవంబర్ 26న వరకట్న వ్యతిరేక దినోత్సవంగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజు స్కూల్స్‌, కాలేజీలు, ఇతర విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు కట్నం తీసుకోమని ప్రతిజ్ఞ చేయాలని ప్రభుత్వం సూచించింది. గత నెలలో వరకట్నానికి వ్యతిరేకంగా విద్యార్థులందరూ తమ డిగ్రీ తీసుకోవడానికి ముందు బాండ్ ఇవ్వాలని రాష్ట్ర గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ సూచించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు