కేరళలో మంకీపాక్స్‌ కలకలం.. దేశంలోనే తొలి కేసు!

14 Jul, 2022 18:08 IST|Sakshi

తిరువనంతపురం: ఇప్పటికే కరోనా మహమ్మారితో రెండేళ్లకుపైగా ఇబ్బందులు పడుతున్నాం. తాజాగా మరో మహమ్మారి దేశంలోకి అడుగుపెట్టింది. కేరళలో ఓ వ్యక్తికి మంకీపాక్స్‌ అనుమానిత లక్షణాలు బయటపడ్డాయి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) నుంచి నాలుగు రోజుల క్రితం వచ్చిన ఓ వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. అతడి నమూనాలను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించినట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీనా జార్జ్‌ తెలిపారు. 

యూఏఈలో మంకీపాక్స్‌ సోకిన వ్యక్తిని కలిసిన క్రమంలో అనారోగ్యానికి గురికాగా.. ఆసుపత్రిలో చేరినట్లు వీణా జార్జ్‌ తెలిపారు. బాధితుడిని ఐసోలేషన్‌కు తరలించి పరిశీలనలో ఉంచినట్లు చెప్పారు. ‘ఎలాంటి భయం అవసరం లేదు. మంకీపాక్స్‌కు వైద్యం ఉందని, వైరస్‌ సోకిన వ్యక్తితో కలిసిన వారికే వ్యాప్తి చెందుతుందని వైద్యులు తెలిపారు. వైరాలజీ ల్యాబ్‌ నివేదిక తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి. బాధితుడు దేశంలోకి వచ్చాక ఎవరినీ కలవలేదు.’ అని తెలిపారు ఆరోగ్య మంత్రి. 

మరోవైపు.. స్థానిక ల్యాబ్‌లో పరీక్షించగా బాధితుడికి మంకీపాక్స్‌ సోకినట్లు నిర్ధారణ అయిందని ఆరోగ్య శాఖలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. అయితే.. మరోమారు నిర్ధారించుకునేందుకు పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు నమూనాలు పంపించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిపుణులు హెచ్చరిస్తున్నారు. అత్యంత వేగంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతున్నట్లు వెల్లడించారు. అయితే.. వ్యాధి లక్షణాలు బయటపడ్డాకే ఇతరులకు వ్యాప్తి చెందుతోందని గుర్తించారు. జ్వరం, తలనొప్పి, ఫ్లూ వంటి లక్షణాలతో మొదలవుతుందన్నారు.  వైరస్‌ సోకిన 5 నుంచి 21 రోజుల్లో బయపడుతుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఇదీ చూడండి: Monkeypox Global Health Emergency: మంకీపాక్స్ ప్రమాకరమైనదేనా? కాదా! డబ్ల్యూహుచ్‌ఓ అత్యవసర సమావేశం

మరిన్ని వార్తలు