నటి లైంగిక దాడి కేసు: చిక్కుల్లో నటుడు దిలీప్‌.. హైకోర్టు మరో షాక్‌

19 Apr, 2022 17:12 IST|Sakshi

మలయాళ స్టార్‌ నటుడు దిలీప్‌కు కేరళ హైకోర్టు షాక్‌ ఇచ్చింది. తనకు వ్యతిరేకంగా దాఖలైన హత్య కుట్ర కేసును కొట్టేయాలంటూ దిలీప్‌ దాఖలు చేసిన అభ్యర్థన పిటిషన్‌ను మంగళవారం కొట్టేసింది.

మలయాళ ప్రముఖ నటి లైంగిక వేధింపుల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు దిలీప్‌ తాజా అభ్యర్థనను హైకోర్టు జస్టిస్‌ జియాద్‌ రెహమాన్‌ తోసిపుచ్చారు. ఈ కేసులో విచారణ జరిపిన ఓ అధికారి ఫిర్యాదు మేరకు.. క్రైమ్‌ బ్రాంచ్‌ ఈ ఏడాది జనవరి 9వ తేదీన మరో కేసు నమోదు చేసింది. విచారణ అధికారులను హత్య చేయాలని దిలీప్‌ కుట్ర పన్నాడంటూ అందులో అభియోగం నమోదు చేశారు.

హత్య చేయాలనే..
దిలీప్‌ గొంతుగా భావిస్తున్న ఆడియో క్లిప్‌ ఒకటి ఆ మధ్య ఓ టీవీ ఛానెల్‌లో టెలికాస్ట్‌ అయ్యింది. దానిని ఆయన సన్నిహితుడు బాలచంద్ర కుమార్‌ బయటపెట్టడం విశేషం. అందులో ఈ కేసులో విచారణ చేపట్టిన అధికారులకు హాని తలపెట్టాలన్న ఆలోచనతో దిలీప్‌ ఉన్నట్లు స్పష్టమైంది. దీంతో క్రైమ్‌ బ్రాంచ్‌ హత్య కుట్ర నేరం మీద కేసు నమోదు చేశారు. అంతేకాదు.. దిలీప్‌ మాజీ భార్య, నటి మంజు వారియర్‌ను సైతం క్రైమ్‌ బ్రాంచ్‌ వాయిస్‌ కన్ఫర్మేషన్‌ కోసం ప్రశ్నించింది. ఆ ఫోన్‌ సంభాషణల్లో దిలీప్‌తో పాటు దిలీప్‌ కుటుంబ సభ్యులకు చెందిన మరో ఇద్దరి గొంతులను మంజు గుర్తుపట్టింది. 

ఈ తరుణంలో ప్రాసిక్యూషన్‌ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. హత్య కుట్ర కేసు కొట్టేయాలంటూ దిలీప్‌ దాఖలు చేసిన అభ్యర్థనను కొట్టేసింది. మరోవైపు దిలీప్‌ బెయిల్‌ రద్దు చేయాలని, దిలీప్‌ బయట ఉంటే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కేరళ క్రైమ్‌ బ్రాంచ్‌, కేరళ పోలీసులు కోర్టును కోరుతున్నారు. ఈ పిటిషన్‌ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. 

2017 కేరళ నటి దాడి కేసు
2017, ఫిబ్రవరి 17వ తేదీ రాత్రిపూట మలయాళంతో పాటు సౌత్‌లోని పలు భాషల్లో నటించిన ఓ హీరోయిన్‌ను బలవంతంగా ఎత్తుకెళ్లి, కారులోనే రెండు గంటలపాటు వేధింపులకు పాల్పడ్డారు కొందరు దుండగులు. ఆపై ఆ వేధింపుల పర్వాన్ని ఫోన్‌లలో రికార్డు చేసి.. బ్లాక్‌మెయిల్‌కు పాల్పడాలని చూశారు. ఈ కేసులో దిలీప్‌తో పాటు పది మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు.. ఆపై బెయిల్‌పై విడుదల చేశారు.

మరిన్ని వార్తలు