వైఫ్‌ అంటే వాడుకుని వదిలేసే వస్తువు కాదు.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు

1 Sep, 2022 17:06 IST|Sakshi

ఆయనకు పెళ్లైంది. ముగ్గురు పిల్లలు. కానీ, మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యను మానసికంగా హింసించాడు. అయితే ఇది ఇంతటితో ఆగలేదు. భార్యను శాశ్వతంగా వదిలించుకుని ప్రియురాలికి దగ్గరయ్యేందుకు ‘విడాకుల’నే మాస్టర్‌ ప్లాన్‌ వేశాడు.  పైగా భార్య తనపై దాడి చేసిందంటూ ‘వైవాహిక క్రూరత్వం’ కారణంగా చూపించాడు. మరి న్యాయస్థానం ఈ కేసులో ఎలాంటి తీర్పు ఇచ్చిందంటే.. 

వివాహ బంధం.. ఏదో వస్తువును కొనుక్కున్నట్లు కాదు. భార్యంటే వాడుకుని వదిలేసే వస్తువు కాదు. మన సంప్రదాయం అది కానే కాదు. ఇప్పటి యువతరం మనస్తత్వాన్ని, పాటిస్తున్న ఆచార వ్యవహారాలను,  సంప్రదాయపు అంశాలను పరిగణనలోకి తీసుకునే మేం ఈ వ్యాఖ్యలు చేస్తున్నాం. కొత్త తరం దాదాపుగా.. పెళ్లంటే ఒక అరిష్టంగా భావిస్తోంది. సహజీవన సంప్రదాయం పెరిగిపోతోంది. ఇది సమాజపు మనస్సాక్షిని ఇబ్బందికి గురి చేస్తోంది.

WIFE అంటే..
ఈరోజుల్లో.. అంతా పెళ్లిని ఒక ‘చేదు’ అనుభవంగా భావిస్తున్నారు. వ్యక్తిగతంగా స్వేచ్ఛ జీవితానికి, బాధ్యతలకు, విధులకు పెళ్లి ఒక ఆటంకంగా మారిపోయినట్లు ఫీలైపోతున్నారు. ఒకప్పుడు వైఫ్‌ అంటే Wise Investment For Ever అనే అర్థం ఉండేది. ఇప్పుడది Worry Invited For Everగా మారిపోయింది. 'యూజ్ అండ్ త్రో' అనే వినియోగదారుల సంస్కృతి మన వివాహ సంబంధాలను కూడా ప్రభావితం చేసినట్లు కనిపిస్తోంది. విడిపోయినప్పుడు వీడ్కోలు చెప్పుకోవడానికే.. లివ్-ఇన్-రిలేషన్షిప్స్ అన్నచందాన మారిపోయింది పరిస్థితి. 

విడాకులతో నాశనం కాబడ్డ కుటుంబాల ఆర్తనాదాలు మొత్తం సమాజం మనస్సాక్షిని కదిలించే శక్తి ఉంది. విడాకుల కోసం కోర్టుకెక్కిన జంటలు, విడాకుల తర్వాత పిల్లలను విడిచిపెడుతున్నవాళ్లు, విడాకులు తీసుకున్నవారు.. పెరిగిపోతున్నప్పుడు.. కచ్చితంగా అది సామాజిక జీవితంలోని ప్రశాంతతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందనడంలో సందేహం లేదు అని కేరళ హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

కేసు ఏంటంటే.. 
కేరళ అలపుజ్జాకు చెందిన జంటకు సౌదీ అరేబియాలో స్థిరపడింది. 2009లో వివాహం జరగ్గా.. 2018లో విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టుకు వెళ్లాడు భర్త. తన భార్య తనపై దాడి చేసిందని, క్రూరత్వం కింద తనకు విడాకులు ఇప్పించాలని కోరాడతను. అయితే.. 2017 నుంచి ఓ మహిళతో తన భర్త వివాహేతర సంబంధం నడిపిస్తున్నాడని, ప్రశ్నించినందుకే ఇలా తన నుంచి విడిపోవాలనుకుంటున్నాడని సదరు భార్య వాదనలు వినిపించింది. ఈ క్రమంలో భార్య క్రూరత్వాన్ని నిరూపించే సాక్ష్యాలు, ఆధారాలు లేకపోవడంతో క్ట్రిస్టియన్‌ మ్యారేజ్‌ యాక్ట్‌.. డైవోర్స్‌ యాక్ట్‌ 1869 ప్రకారం.. ఫ్యామిలీ కోర్టు ఆ భర్త దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను కొట్టేసింది. ఈ నేపథ్యంలో ఆ భర్త హైకోర్టును ఆశ్రయించాడు. 

అయితే ఈ మొత్తం వ్యవహారంలో ట్విస్ట్‌ ఏంటంటే.. అతని తల్లి మాత్రం కోడలి వైపే నిలబడింది. తన కొడుకు కోడలు, వాళ్ల పిల్లలతో మంచిగా బతకాలని పోరాడింది. మరోవైపు భార్య(38) కూడా తన భర్త వివాహేతర సంబంధాన్ని వదులకుని తనతో సంతోషంగా ఉంటే చాలనుకుంటోంది. దీంతో ఈ మొత్తం అంశాలను పరిగణనలోకి తీసుకున్న కేరళ హైకోర్టు బెంచ్‌..  పైన చెప్పిన విధంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్న విషయాన్ని నొక్కి మరీ చెప్పి.. విడాకుల పిటిషన్‌ను తిరస్కరించింది. అంతేకాదు.. భార్యతో సజావుగా కాపురం చేసుకోవాలని సదరు భర్తకు సూచిస్తూ డివిజన్‌ బెంచ్‌ జస్టిస్‌ ముహమ్మద్‌ ముస్తాక్యూ, జస్టిస్‌ సోఫీ థామస్‌లు కీలక వ్యాఖ్యలతో ఆగస్టు 24వ తేదీన తీర్పు ఇచ్చారు. 

ఇదీ చదవండి: డాక్టర్‌ కోసం పడిగాపులు.. కన్నతల్లి ఒడిలోనే పసికందు మృతి

మరిన్ని వార్తలు