కేరళ నరబలి కేసు: పోర్న్‌ సినిమాల్లో నటిస్తే రూ.10 లక్షలు!

14 Oct, 2022 08:16 IST|Sakshi
పాతిపెట్టిన అవశేషాలను సేకరిస్తున్న క్లూస్‌ టీం.. (ఇన్‌సెట్‌లో షఫీ)

కేరళలోని పతనంతిట్ట ఎలంతూరు నరబలి ఉదంతంలో.. వెన్నులో వణుకుపుట్టించే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నిందితులను ప్రేరేపించడంతో పాటు బాధితులకు డబ్బు ఆశతో ఎర చూపించడం, ఆపై వాళ్లను తీసుకొచ్చి అత్యంత కిరాతకంగా బలి ఇవ్వడం.. ఇలా దాదాపు ప్రతీ దాంట్లోనూ మహమ్మద్‌ షఫీ అలియాస్‌ రషీద్‌ కీలకంగా వ్యవహరించినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. అంతేకాదు స్థానికంగా 12 మంది మహిళల మిస్సింగ్‌ కేసుకు.. వీళ్లకు సంబంధం ఉండి ఉంటుందనే కోణంలోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు.

కేరళ జంట నరబలి కేసులో షఫీ(52) ఆకృత్యాలు ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయి. నరబలి ఇస్తే ఆర్థికంగా లాభపడతారని షఫీ చెప్పిన మాయమాటలతో తాము ఎలా నేరం చేశామన్నది భగవల్‌ సింగ్‌- లైలా దంపతులు పోలీసులకు వివరించారు. ఈ వివరాలను, దర్యాప్తులో వెలుగు చూసిన మరిన్ని విషయాలను పోలీసులు మీడియాకు తాజాగా వివరించారు.  ఈ ఉదంతం కంటే ముందే షఫీపై కొన్ని కేసులు ఉన్నాయి. రెండేళ్ల కిందట ఓ వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ కేసులో ఆమెను లైంగికంగా హింసించగా.. అదే ఆనవాలు ఇప్పుడు రోసిలీ, పద్మమ్‌ ఒంటిపై అయిన గాయాల్లోనూ కనిపించాయి. 


నిందితులు భగవల్‌ సింగ్‌, అతని భార్య లైలా

షఫీ ఓ సైకోపాత్‌. కేరళ ఎర్నాకులం జిల్లా పెరుంబవూరులో పుట్టిపెరిగాడు. ఆరో తరగతి దాకా చదువుకున్న అతనికి వివాహం కూడా అయింది. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మూడేళ్ల మనవరాలు కూడా ఉంది. డ్రైవర్‌ నుంచి మెకానిక్‌ వరకు చాలా ఉద్యోగాలు చేశాడు. ప్రస్తుతం కొచ్చిలో ఒక చిన్న హోటల్‌ని నడుపుతున్నాడు. బాధితులిద్దరూ తరచూ ఈ హోటల్‌కు వెళ్తుండేవాళ్లని, ఈ క్రమంలో వాళ్ల మధ్య పరిచయం ఏర్పడిందని పోలీసులు తెలిపారు. హోటల్‌కు వచ్చే మహిళల్లో కుటుంబాలకు దూరంగా, బాధల్లో ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని తన సైకో గుణం బయటపెట్టేవాడని పోలీసులు వివరించారు. అయితే షఫీ కుటుంబం మాత్రం అతనిలో ఏనాడూ తమకు ఎలాంటి సైకో గుణం కనిపించేది కాదని అంటోంది.


భగవల్‌ సింగ్‌ ఇంటి బయట గుమిగూడిన జనం

పైశాచిక ఆనందం కోసమే.. 
లైంగిక ఆనందం కోసం షఫీ ఎక్కడిదాకా అయినా వెళ్తాడు. చంపేందుకు కూడా వెనకాడడు. ఈ క్రమంలో గతంలో కొందరు సెక్స్‌ వర్కర్లపై అతను దాడి కూడా చేసినట్లు తేలింది. ఇక ఆర్థిక సమస్యలతో బాధపడేవాళ్లను ట్రాప్‌ చేసేందుకు ఫేస్‌బుక్‌లో డాక్టర్‌ శ్రీదేవి అనే పేరుతో ఒక ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను తెరిచాడు. ఈ అకౌంట్‌ ద్వారానే ఆర్థికంగా చితికిపోయి ఉన్న భగవల్ సింగ్‌ కుటుంబంతో పరిచయం పెంచుకున్నాడు. భగవల్‌ సింగ్‌ ఓ ట్రెడిషినల్‌ హీలర్‌.. మసాజ్‌ థెరపిస్ట్‌. మూడేళ్ల పాటు ఆ పరిచయం కొనసాగి.. చివరకు తనను తాను మంత్రగాడిగా  చెప్పుకుని.. కష్టాలు తొలగిస్తానని వాళ్లను నమ్మబలికాడు. అలా ఈ జంట ద్వారా ఇతరులను వేధించి..  మానసిక ఆనందం పొందాలని యత్నించాడు.


కనిపించకుండా పోయిన రోజు సీసీ ఫుటేజ్‌లో పద్మమ్‌

పోర్న్‌ సినిమాల ఆఫర్‌తో.. 
భర్తకు దూరంగా ఉంటూ.. లాటరీ టికెట్లు అమ్ముకుంటూ పొట్టపోసుకుంటున్న రోసిలీని మొదట టార్గెట్ చేశాడు షఫీ. పోర్న్‌ చిత్రాల్లో నటిస్తే రూ.10 లక్షలు ఇస్తానని మాటిచ్చాడు. దీంతో డబ్బు కోసం ఆమె ఆ పనికి సిద్ధపడింది. జూన్‌ 6వ తేదీన ఆమె షఫీ వెంట వెళ్లగా.. తిరిగి రాలేదు. ఒంటరి మహిళ కావడంతో ఆమె అదృశ్యం గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఇక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పద్మమ్‌ను అదే తరహాలో టార్గెట్‌ చేశాడు షఫీ. తనకు పడక సుఖం అందిస్తే.. రూ.15 వేలు ఇస్తానని ఆశ పెట్టాడు. నమ్మి వెంట వెళ్లిన ఆమె కూడా తిరిగి రాలేదు. పద్మమ్‌ కుటుంబం ఫిర్యాదు చేయడంతో.. సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా కేసును చేధించగలిగారు పోలీసులు. ఆపై నరబలి ఉదంతం, షఫీ రాక్షసత్వం ఒక్కొక్కటిగా వెలుగు చూశాయి. 


నిందితులు లైలా, షఫీ, భగవల్‌ సింగ్‌(ఎడమ నుంచి కుడి)

క్లోజ్‌ ఫ్రెండ్‌నే ఇరికించే డ్రామా

ఈ కేసులో రెండో నిందితురాలు.. భగవల్ సింగ్ భార్య అయిన లైలా సైతం షఫీతో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు విచారణలో వెల్లడైంది. అదే సమయంలో హత్యల గురించిన సమాచారాన్ని లీక్ చేస్తారనే భయంతో సింగ్‌ని తొలగించడానికి షఫీ, లైలా ప్లాన్ చేశారని తెలిసింది. మరోవైపు షఫీ తన స్నేహితుడు, ఆటో డ్రైవర్‌ ముహమ్మద్ బిలాల్‌ను ఈ కేసులో ఇరికించే యత్నం చేశాడు. తన స్కార్పియోను బిలాల్‌ వాడుకున్నాడని, కిడ్నాప్‌ వెనుక అతని హస్తం కూడా ఉందని షఫీ చెప్పడంతో..  రెండు రోజులపాటు పోలీసులు ప్రశ్నించారు. చివరికి అతని ప్రమేయం లేదని నిర్ధారించుకుని పోలీసులు వదిలేశారు. 


నరబలి జరిగింది ఇదే ఇంట్లో..

వండుకుని తిన్నది నిజమేనా?

కేరళ ఎలంతూరు నరబలి కేసును చేధించిన కొచ్చి డీసీపీ శశిధరన్‌ ఆధ్వర్యంలోనే ప్రత్యేక విచారణ బృందం(సిట్‌)కే  ఈ కేసును అప్పజెప్పింది కేరళ హోం శాఖ. పోర్న్‌ సినిమాల్లో నటించాలని, పడక సుఖం అందించాలని డబ్బు ఆశజూపి బాధితులిద్దరినీ షఫీనే ట్రాప్‌ చేసి.. చంపినట్లు ఓ అంచనాకి వచ్చారు. అదే సమయంలో డబ్బు ఆశతోనే భగవల్‌ సింగ్‌, లైలాలను షఫీ లోబర్చుకుని.. ఈ ఘాతుకాలకు పాల్పడినట్లు నిర్ధారించుకున్నారు. దీంతో షఫీని ప్రధాన నిందితుడిగా, ఆ జంటను సహనిందితులుగా పేర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


కేసు వివరాల్ని వెల్లడిస్తున్న కొచ్చి పోలీస్‌ కమిషనర్‌ నాగరాజు

బాధితులిద్దరినీ ఒకే రీతిలో బలి ఇచ్చినట్లు లైలా-భగవల్‌లు అంగీకరించారు. అయితే మంచానికి కట్టేసి.. నోట్లో గుడ్డలు కుక్కేసి.. ఆపై ప్రైవేట్‌ భాగాలపై కత్తితో గాయాలు చేసి.. వక్షోజాలను కోసేసి..  చివరికి గొంతు కోసి షఫీనే చంపాడని ఆ దంపతులు చెప్తున్నారు. తాము నర బలికి సహకరించామని, ఆపై ముక్కలుగా నరికి.. పాతేశామని వెల్లడించారు. అయితే.. శరీర భాగాలను వండుకుని తిన్నారనే అనుమానాలు ఉన్నా.. అందుకు సంబంధించిన నిర్ధారణ ఇంకా కాలేదని పోలీసులు వెల్లడించారు. వీళ్ల రక్త చరిత్ర ఇది మాత్రమే అయ్యి ఉండదని, మరో 12 మంది మహిళల మిస్సింగ్‌ కేసులతో సంబంధం ఉండి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే ఈ ముగ్గురిని విచారించేందుకు మరో రెండు వారాల కస్టడీకి కోర్టును అనుమతి కోరారు. 

రాజకీయ విమర్శలు
ఇక ఈ కేసులో భగవల్‌ సింగ్‌ను తప్పించే యత్నం జరుగుతోందని బీజేపీ విమర్శిస్తోంది. అధికార పార్టీ మద్దతుదారుడు కావడంతోనే షఫీని హైలైట్‌ చేసి.. భగవల్‌ను తప్పించాలని చూస్తున్నారంటూ పోలీస్‌ శాఖపై ఆరోపణలు గుప్పిస్తోంది. అయితే ఈ ఆరోపణలను అధికార పార్టీ ఖండిస్తోంది.

ఇదీ చదవండి: విద్యార్థినిపై హత్యాచారం.. ఆపై యాక్టింగ్‌!

మరిన్ని వార్తలు