కేరళను ముంచెత్తిన వరదలు.. ఫొటోలు, వీడియోలు వైరల్‌

17 Oct, 2021 11:21 IST|Sakshi
ధ్వంజమైన ఇళ్లు.. కొనసాగుతున్న సహాయక చర్యలు

తొమ్మిది మంది మృతి  

రంగంలోకి దిగిన ఆర్మీ  

తిరువనంతపురం: కేరళ వర్ష బీభత్సానికి చిగురుటాకులా వణికిపోతోంది. కొట్టాయం, ఇడుక్కి జిల్లాలలోని వరదల ధాటికి కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో మూడు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 15 మంది ప్రాణాలు కోల్పోగా మరో 12 మంది గల్లంతయ్యారు. కొట్టాయంలో 12 మంది, ఇడుక్కిలో ముగ్గురు మృతి చెందారు. భారత వాతావరణ శాఖ 5 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించగా, మరో ఏడు జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు సహాయ చర్యలకు ఆర్మీ రంగంలోకి దిగింది.

భారత వైమానిక దళం కూడా హెలికాప్టర్లను సిద్ధం చేసి ఉంచింది. మిగ్‌–17, సారంగ్‌ హెలికాప్టర్లను దక్షిణ ఎయిర్‌ కమాండ్‌ పరిధిలో అన్ని వైమానిక స్థావరాల్లో సిద్ధంగా ఉంచారు. అరేబియన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కేరళలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పథనమిట్టా, కొట్టాయం, ఎర్నాకుళం, ఇద్దుకి, త్రిశూర్‌ జిల్లాల్లో రెడ్‌ అలెర్ట్‌ జారీ అవగా, తిరువనంతపురం, కొల్లామ్, అలపుజా, పాలక్కడ్, మల్లాపురం, కొజికోడ్, వాయాండ్‌ జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించినట్టుగా సహకార శాఖ మంత్రి విఎన్‌ వాసవన్‌ వెల్లడించారు.

తొడుప్పుజ వద్ద రోడ్డుపైకి చేరిన వరద నీరు, కూలిన చెట్లు

కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం అందరూ జాగ్రత్తగా ఇళ్లల్లోనే ఉండాలని ప్రజలకి హెచ్చరికలు పంపింది. ప్రధానంగా పర్వత, నదీ ప్రాంతాల్లో ఉన్న వారు ప్రయాణాలు చేయొద్దని సూచించింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

బస్సు వీడియో వైరల్‌ 
వరద నీటిలో మునిగిపోతున్న పలు ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఒక బస్సు పూర్తిగా నీటిలో మునిగిపోతూ ఉండడంతో దాని నుంచి బయటపడడానికి ప్రయాణికులు చేసే హాహాకారాలకు సంబంధించిన వీడియో గుండె దడ పెంచుతోంది. ఈ ఒక్క వీడియో కేరళలో భయంకర పరిస్థితికి అద్దం పడుతోందని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. కొట్టాయంలో వర్షపు నీటిలో ఒక కారుకి తాళ్లుకట్టి లాగి తీసుకువెళుతున్న వీడియోని నెటిజన్లు విస్తృతంగా షేర్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు