ఫ్యామిలీ కోసం సొంతంగా విమానం తయారు చేశాడు!

27 Jul, 2022 19:17 IST|Sakshi

కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ సమయం ఎంతో భారంగా గడిచింది. కొంత మంది మాత్రం ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని రకరకాల వ్యాపకాలతో తమ సృజనకు పదునుపెట్టుకున్నారు. కేరళకు చెందిన ఎన్నారై అశోక్ అలిసెరిల్ తమరాక్షన్ అయితే ఏకంగా చిన్నపాటి విమానాన్నే తయారు చేశాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.

తాను సొంతంగా తయారు చేసిన ఫోర్‌ సీటర్‌ విమానంలో కుటుంబంతో కలిసి యూరప్‌ యాత్ర చేస్తున్నాడు అశోక్. కేరళలోని అలప్పుజా ప్రాంతానికి చెందిన ఆయన లండన్‌లో స్థిరపడ్డాడు. మాస్టర్స్ డిగ్రీ చేయడానికి 2006 యూకే వచ్చిన అశోక్ ప్రస్తుతం ఫోర్డ్ మోటార్ కంపెనీలో పనిచేస్తున్నాడు. 


18 నెలలు శ్రమించి..

కరోనా సమయంలో విధించిన లాక్‌డౌన్‌ విధించడంతో విమాన తయారీకి ఉపక్రమించాడు. దాదాపు 18 నెలలు శ్రమించి ‘స్లింగ్‌ టీఎస్‌ఐ’ మోడల్‌లో చిన్న విమానాన్ని తయారు చేశాడు. తన చిన్న కూతురు దియా పేరు కలిసొచ్చేలా విమానానికి ‘జి-దియా’ అని నామకరణం చేశాడని ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ వెల్లడించింది. కేరళ మాజీ ఎమ్మెల్యే ఏవీ తమరాక్షన్ కుమారుడైన అశోక్‌కు పైలట్‌ లైసెన్స్‌ కూడా ఉంది. దీంతో కుటుంబంతో కలిసి తన విమానంలో ఇప్పటివరకు జర్మనీ, ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్‌ దేశాలను చుట్టేసి వచ్చాడు. 
 

విమానాన్ని ఎలా తయారు చేశానంటే..

‘2018లో పైలట్ లైసెన్స్ పొందిన తర్వాత ప్రయాణాల కోసం రెండు సీట్ల విమానాలను అద్దెకు తీసుకునేవాడిని. నా ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకెళ్లడానికి నాలుగు సీట్ల విమానం అవసరం. కానీ అవి చాలా అరుదుగా దొరుకుతాయి. జోహన్నెస్‌బర్గ్‌(దక్షిణాఫ్రికా)కు చెందిన స్లింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీ 2018లో టీఎస్‌ఐ మోడల్‌ విమానాన్ని తయారు చేయనున్నట్టు ప్రకటించింది. దీంతో ఒకసారి నేను స్లింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఫ్యాక్టరీని కూడా సందర్శించాను. ఆ తర్వాత నా సొంత విమాన తయారీకి అవసరమైన వస్తువులను ఆర్డర్‌పై అక్కడి నుంచి తెప్పించాను. లాక్‌డౌన్‌తో సమయం దొరకడంతో విమాన తయారీపై దృష్టి పెట్టాన’ని అశోక్‌ వివరించాడు. విమాన తయారీకి దాదాపు రూ.1.8 కోట్లు వెచ్చించినట్టు తెలుస్తోంది. కలల విమానంలో గగన విహారంతో వార్తల్లోకి ఎక్కారు అశోక్ అలిసెరిల్ తమరాక్షన్. అతడిని గురించి విన్నవారంతా ‘సూపర్‌’ అంటూ మెచ్చుకుంటున్నారు. (క్లిక్: స్పైస్‌జెట్‌కు షాక్.. ఆంక్షలు విధించిన డీజీసీఏ)

మరిన్ని వార్తలు