గప్పీలతో గంపెడాదాయం!

28 Jan, 2021 08:07 IST|Sakshi

కోవిడ్‌–19 కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది బతుకుదెరువు కోల్పోయి రోడ్డున పడ్డారు. కేరళలోని ఎర్నాకులానికి చెందిన 39 ఏళ్ల ఆయ్యప్పదాసు కూడా లాక్‌డౌన్‌తో తన కార్పెంటర్‌ ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో బాగా ఆలోచించి గప్పీ చేపలను అమ్ముతూ నెలకు రూ.25000 వరకు గడిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇండియాలో కోవిడ్‌–19 విజృంభిస్తున్న తొలి రోజుల్లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించింది. అప్పటివరకు అయ్యప్పదాస్‌ కార్పెంటర్‌గా చాలా బిజీగా ఉండేవాడు. లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ తో ఎక్కడివాళ్లు అక్కడే ఇళ్లలో ఉండిపోవడంతో ఆర్డర్లు లేక అతని జీవన భృతి ఆగిపోయింది.

అప్పుడు ఆదాయం వచ్చే మార్గాలు ఏవైనా ఉన్నాయా అని దాస్‌ ఇంటర్నెట్‌లో వెతకడం ప్రారంభించాడు. ఇంట్లోనుంచే చేసే బిజినెస్‌ ఐడియాలు అనేకం కనిపించాయి కానీ వాటిలో ఏవీ తనకు నచ్చలేదు. ఈ క్రమంలోనే తన ఇంట్లోని ఆక్వేరియంలో ఉన్న గప్పీ చేపలు (మిలియన్‌ ఫిష్‌) కనిపించాయి. వెంటనే గప్పీ చేపలు పెంచి అమ్మితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది దాస్‌కు. వివిధ రంగుల్లో ఆకర్షణీయంగా కనిపించే గప్పీలను అమ్మడం ద్వారా మంచి ఆదాయం వస్తుందని అనుకుని, ఆలస్యం చేయకుండా కార్యాచరణ మొదలు పెట్టాడు. కొన్ని రకాల గప్పీలను తీసుకొచ్చి ఇంట్లో పెంచడం మొదలు పెట్టాడు. రెండు నెలల వయస్సున్న రెండు జతల మగ, ఆడ గప్పీలు కొని రెండింటిని రెండు ట్యాంకుల్లో విడివిడిగా ఉంచి నాలుగునెలల వయసు వచ్చేంత వరకు పెంచి ఆ తరువాత  రెండింటిని ఒక ట్యాంక్‌లో ఉంచాడు. మూడు నెలల తరువాత అవి పిల్లల్ని పెట్టడం మొదలు పెట్టాయి.

మొదటిదశలో అవి 10–25 పిల్లలు పెడితే.. తరువాతి దశలో 80వరకు పెట్టాయని దాస్‌ చెప్పాడు. అలా పెరిగిన గప్పీ పిల్లల ఫోటోలను తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేయడంతో.. అవి చూసిన ఫ్రెండ్స్, బంధువులు తమకు కావాలని ఆర్డర్లు ఇవ్వడం మొదలెట్టారు. దీంతో గప్పీలకు ఎంత డిమాండ్‌ ఉందో అర్ధమైంది దాస్‌కు. వెంటనే మరో రెండు కొత్త ఫిష్‌ ట్యాంక్‌లను కొని గప్పీల సంఖ్యను పెంచాడు. ప్రస్తుతం 18 రకాల్లో 1500కు పైగా గప్పీలను దాస్‌ పెంచుతున్నాడు. వీటిలో రెడ్, చిల్లీ రెడ్, ఆల్బీనో రెడ్, రెడ్‌డ్రాగన్‌ వంటి రంగుల్లో ఉన్నాయి. ఇప్పటిదాకా ఐదువేలకుపైగా గప్పీలను దాస్‌ అమ్మాడు. ఇలా అమ్ముతూ నెలకు 25 వేలరూపాయలు సంపాదిస్తున్నట్లు దాస్‌ చెప్పుకొచ్చాడు. గప్పీ చేపలను మిలియన్‌ ఫిష్, రెయిన్‌బో ఫిష్‌ అని కూడా అంటారు. వీటిని ఎక్కువగా ఆక్వేరియాల్లో పెంచుతుంటారు. గప్పీల పరిమాణం, తోక సైజు, ఆకృతి, రంగుని బట్టి వివిధ రకాలు లభ్యమవుతున్నాయి.

మరిన్ని వార్తలు