Kerala Traffic Challan: దీనికి కూడా ఫైన్ వేస్తారా? రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బండ్లో పెట్రోల్ లేదని చలాన్

27 Jul, 2022 16:15 IST|Sakshi

తిరువనంతపురం: బైక్‌పై వెళ్తున్నప్పుడు హెల్మెట్ ధరించకపోయినా, ట్రాఫిక్ నిబంధనలు పాటించకున్నా  ఫైన్ వేయడం సాధారణంగా జరుగుతుంటుంది. కానీ కేరళలోని ఓ ట్రాఫిక్ పోలీస్ మాత్రం బైక్‌లో సరిపడా పెట్రోల్ లేదని రూ.250 ఫైన్ వేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను బసిల్ శ్యామ్ అనే వ్యక్తి తన ఫేస్‌బుక్‌లో షేర్ చేశాడు. అది కాస్తా వైరల్‌గా మారింది. బైక్‌లో పెట్రోల్ లేకపోతే కూడా ఫైన్ వేస్తారా? ఇలాంటి రూల్ కూడా ఉందా? అని నెటిజన్లు కేరళ ట్రాఫిక్ పోలీసులపై సెటైర్లు వేస్తున్నారు.

బసిల్‌ శ్యామ్ తన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌పై ఆఫీస్‌కు వెళ్లే క్రమంలో వన్‌ వే స్ట్రీట్‌లో అపసవ్యదిశగా బండి నడిపాడు. అది చూసి ట్రాఫిక్ పోలీస్‌ బైక్ ఆపాడు. రూ.250 ఫైన్ కట్టమన్నాడు. అందుకు ఒప్పుకుని అతను చెల్లించాడు. అయితే తీరా ఆఫీస్‍కు వెళ్లాక చలాన్ చూస్తే.. బైక్‌లో సరిపడా పెట్రోల్ లేనందుకు ఫైన్ వేసినట్టుంది. దీంతో అతడు షాక్ అయి చలాన్ ఫోటో తీసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. అది కాస్తా వైరల్‌ అయ్యింది.

భారత మోటారు వాహన చట్టం, కేరళ చట్టంలో బైక్‌లో పెట్రోల్ సరిపడా లేకపోతే ఫైన్ వేయాలనే నిబంధన ఎక్కడా లేదు. అయితే బస్సు, కారు, వ్యాను, ఆటో వంటి కమర్షియల్ వాహనాలు పెట్రోల్,డీజిల్‌ సరిపడా లేకుండా ప్రయాణించి ప్రయాణికులకు ఇబ్బంది కల్గిస్తే రూ.250 ఫైన్ కట్టాలనే నిబంధన కేరళ రవాణా చట్టంలో ఉంది. కానీ ఇది బైక్‌లకు వర్తించదు. దీంతో ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని మాజీ అధికారులు రవాణా శాఖకు సూచించారు.
చదవండి: త్వరలో శివసేన నుంచి మరో సీఎం.. ఉద్ధవ్‌ థాక్రే కీలక వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు