రిపబ్లిక్​ డే రోజు జాతీయ జెండాకు ఘోర అవమానం..

26 Jan, 2022 16:57 IST|Sakshi

తిరువనంతపురం: గణతంత్ర దినోత్సవం రోజు జాతీయ జెండాకు అవమానం ఎదురైంది. ఈ ఘటన కేరళలోని కాసర్​గడ్​ జిల్లాలో చోటుచేసుకుంది. కాసర్​గఢ్​లోని మున్సిపల్​ స్టేడియంలో పోర్టులు​,ఆర్కియాలజీ శాఖ మంత్రి అహ్మద్ దేవరకోవిల్​ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జెండాను తలకిందులుగా ఎగరవేశారు. ఆ తర్వాత జాతీయ గీతాలాపన చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అయితే, అక్కడే ఉన్న కొంత మంది మీడియా సిబ్బంది, ఇతర కార్యకర్తలు దీన్ని గమనించారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జెండాను అవనతం చేసిన మంత్రి.. తిరిగి దాన్ని సరిచేసి మళ్లీ ఎగరేశారు. ప్రస్తుతం ఇది పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది. కాగా, సిపిఐ(ఎం) నేతృత్వంలోని ఎల్​డిఎఫ్​ మిత్రపక్షమైన ఇండియన్​ నేషనల్​ లీగ్​(ఐఎన్​ఎల్​) మంత్రి అయిన  దేవర్​కోవిల్​ జిల్లా కేంద్రంలో గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య​ అతిథిగా హజరయ్యారు.  

ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు హజరయ్యారు. అయితే, అధికారులు జాతీయ గీతాలాపన కార్యక్రమంలో చేశారు. చాలా సేపటికి ఎవరు కూడా జాతీయ జెండా తలకిందులుగా ఎగరడం గమనించకపోవడం తీవ్ర చర్చకు దారితీస్తుంది. అయితే, దీనిపై ప్రస్తుతం రాజకీయ రంగు పులుముకుంది. అహ్మద్ దేవరకోవిల్​ వెంటనే రాజీనామా చేయాలని.. కేరళ బీజేపీ రాష్ట్ర చీఫ్​  కె సురేంద్రన్​ డిమాండ్​ చేశారు.

అదే విధంగా జెండాను అవమానపర్చిన మంత్రి దేవరకోవిల్​ పై పోలీసులు కేసునమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. త్రివర్ణ పతాకాన్ని తలకిందులుగా ఎగురవేసి.. కనీసం గమనించకుండా సెల్యూట్​ చేసి వెళ్లిపోవడం మంత్రి బాధ్యతారాహిత్యానికి అద్దంపడుతుందని, అధికారులు కూడా లోపాన్ని గుర్తించకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ విచారణకు ఆదేశించాలని కోరారు. ఇదే ఘటనపై కేరళ కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు, ఎంపీ రాజ్​మోహన్​ ఉన్నితాన్​ స్పందించారు. జాతీయ జెండాను తలకిందులుగా ఎగరవేయడం దురదృష్టకరమన్నారు.  

చదవండి: రైల్వే పరీక్షా ఫలితాలపై నిరసన... ఏకంగా రైలుకే నిప్పుపెట్టారు

మరిన్ని వార్తలు