Kerala: కేరళ అసెంబ్లీ వద్ద గందరగోళం.. ఎమ్మెల్యేలను నెట్టేసిన సెక్యూరిటీ సిబ్బంది

15 Mar, 2023 16:26 IST|Sakshi

తిరువనంతపురం: కేరళ అసెంబ్లీలో బుధవారం గందరగోళ వాతావరణం నెలకొంది. స్పీకర్‌ కార్యాలయం వెలుపల కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్) ఎమ్మెల్యేలు నిరసనలు చేసేందుకు యత్నించారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. ప్రతిపక్ష నేతలను బలవంతంగా ఎత్తుకుని మరీ బయటకు నెట్టేశారు. ఈ ఘటనలో నలుగురు ఎమ్మెల్యేలు రెమా, ఏకేఎం అష్రఫ్‌​, టీవీ ఇబ్రహీం, సనీష్‌ కుమార్‌లు గాయపడ్డారని ప్రతిపక్ష నేత వీడీ సతీశన్‌ తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన నలుగురు ‍ఎమ్మెల్యేలు, ఐదుగురు సెక్యూరిటీ సిబ్బంది ప్రస్తుతం తిరువనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.

సభలో ప్రతిపక్షాల ప్రజాస్వామ్య హక్కులు నిరంతరం నిరాకరణకు గురవుతున్నాయిని చెప్పారు. ఈ మేరకు ప్రతిపక్ష నేత సతీశన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల మైనర్‌ బాలికపై జరిగిన పాశవిక దాడిని వాయిదా తీర్మానంగా సమర్పించడానికి ప్రయత్నించాం. ఐతే స్పీకర్‌ ఎలాంటి కారణం లేకుండా ఆ నోటీసును తిరస్కరించారు. అలాగే మహిళల భద్రతపై చర్చించే వాయిదా తీర్మానంపై కూడా నోటీసును స్వీకరించలేమని స్పీకర్ ప్రకటించగానే, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ బ్యానర్లు ఊపడం ప్రారంభించారు. అనంతరం సభ నుంచి వాకౌట్ చేసి స్పీకర్ కార్యాలయానికి చేరుకున్నారు.

దీంతో అక్కడ మార్షల్స్‌ సిబ్బంది సీనియర్‌ శాసన సభ్యుడు, మాజీ హోం మంత్రి రాధాకృష్ణన్‌ను నెట్టారని, ఎమ్మెల్యే కేకే రెమ చేతిని నలుగురైదుగురు మహిళా మార్షల్స్‌ నేలపైకి లాగేసారని ఆరోపించారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఒత్తిడి మేరకు స్పీకర్‌ ఏఎన్‌ షంషీర్‌ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని సతీశన్‌ ఆరోపించారు. ముఖ్యమంత్రి ప్రశ్నలకి భయపడుతున్నారు. పైగా ఆయన సమావేశాన్ని త్వరగా ముగించాలని కూడా చెప్పారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు దాడి చేశారని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

(చదవండి: 10 రోజులు స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం!)

మరిన్ని వార్తలు