ఓవర్‌ స్పీడ్‌.. ఓవర్‌ టేక్‌ యత్నం.. కేరళలో ఘోర ప్రమాదం

6 Oct, 2022 08:05 IST|Sakshi

పాలక్కడ్‌: ఓ డ్రైవర్‌ నిర్లక్ష్యం పలువురి ప్రాణాలు బలిగొంది. కేరళలో బుధవారం అర్ధరాత్రి దాటాక ఘోర ప్రమాదం జరిగింది. పాలక్కడ్‌ వడక్కన్‌చ్చెర్రి వద్ద కేరళ ఆర్టీసీ బస్సును ఓ టూరిస్ట్‌ బస్సు ఢీ కొట్టడంతో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో విద్యార్థులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. 

బేస్‌లియస్‌ స్కూల్‌కు చెందిన 10, 11, 12వ తరగతి విద్యార్థులను టూర్‌కు తీసుకెళ్లిన బస్సు.. ఓవర్‌ స్పీడ్‌తో ఓ కారును ఓవర్‌టేక్‌ చేయబోయే ప్రయత్నంలో అదుపు తప్పింది. అంజుమూర్తీ మంగళం బస్టాప్‌ వద్ద ఓ ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఆపై అదుపు తప్పి పక్కనే ఉన్న వాగులో పడి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు దుర్మరణం పాలయ్యారు.


 
వలయార్‌-వడక్కన్‌చెర్రి జాతీయ రహదారిపై అర్ధరాత్రి 12 గం. తర్వాత ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన టైంలో జోరుగా వాన కురుస్తోందని అధికారులు తెలిపారు. టూరిస్ట్‌ బస్సులో 41 మంది చిన్నారులు, ఐదుగురు టీచర్లు, బస్సుకు సంబంధించి ఇద్దరు సిబ్బంది ఉన్నారు. ఇక ఆర్టీసీ బస్సులో 49 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. పన్నెండు మంది పరిస్థితి విషమంగా ఉందని, 28 మంది చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారని తెలిపారు. 

ఆర్టీసీ బస్సు కొట్టారక్కరా నుంచి కొయంబత్తూరు రూట్‌లో వెళ్తోంది. ప్రమాదం తీవ్రమైంది కావడంతో.. మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు చెప్తున్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. క్షతగాత్రులకు పాలక్కడ్‌ జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. వానలో టూరిస్ట్‌ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఘోరం జరిగిందని పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి: బీఆర్‌ఎస్‌పై కర్ణాటక మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు