కోళీకోడ్‌ ఘటన: ‘మీరు దేశానికే ఆదర్శం’

8 Aug, 2020 18:52 IST|Sakshi

బ్లడ్‌ బ్యాంక్‌ల ముందు క్యూ.. ఆహార ప్యాకెట్లు తయారు చేస్తూ

తిరువనంపురం: గాడ్స్‌ ఓన్‌ కంట్రీ కేరళ ఒకేరోజు రెండు ప్రమాదాలను చవిచూసింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వరదలతో ఇబ్బందులు పడగా.. రాత్రి భయంకరమైన విమాన ప్రమాదం కేరళను కుదిపేసింది. అయతే ఈ రెండు ఘటనలు వారిలోని స్పందించే హృదయాన్ని, మానవత్వాన్ని ఏం చేయలేకపోయాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజలు కేరళ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సోషల్ ‌మీడియా బ్లడ్‌ బ్యాంక్‌ ఎదుట క్యూ లైన్లలో నిలిచిన యువత ఫోటోలతో నిండిపోయింది. శుక్రవారం రాత్రి నుంచే కేరళ యువత సహాయక చర్యలు ప్రారంభించారు. విమాన ప్రమాదం గురించి తెలిసిన వెంటనే తొలుత మల్లాపురం స్థానికులు రంగంలోకి దిగారు. బాధితులకు సాయం చేశారు. కోళీకోడ్‌‌ విమానాశ్రయంలో ల్యాండ్‌ కావాల్సిన విమానాలను కన్నూర్‌కు మళ్లించడంతో స్వచ్ఛంధ సేవకులు అర్థరాత్రి వరకు పని చేసి ప్రయాణికులకు ఆహార పొట్లాలను సిద్ధం చేశారు. (‘ఇప్పటివరకు 100 విమానాలు ల్యాండ్‌ అయ్యాయి’)

ఈ క్రమంలో ఓ ట్విట్టర్‌ యూజర్‌ ‘విపత్తు సంభవించిన ప్రతిసారి కేరళలోని స్వచ్ఛంద సేవా స్ఫూర్తి మేల్కొంటుంది. ప్రస్తుతం అదే జరిగింది. కోళీకోడ్‌ విమాన ప్రమాదం గురించి తెలిసిన వెంటనే యువకులు బ్లడ్‌ బ్యాంక్‌ల ముందు క్యూ కట్టారు. మరికొందరు కన్నూర్‌ విమానాశ్రయానికి మళ్లించిన ప్రజల కోసం ఆహార ప్యాకెట్లను సిద్ధం చేశారు’ అని ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ కేరళ స్వచ్ఛంద సేవకులను ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు. ‘కేరళ స్థానికులు రంగంలోకి దిగారు. ఈ స్ఫూర్తి, ఐక్యతనే వీరిని భిన్నంగా చూపిస్తోంది. వరదలు ఓ వైపు, మహమ్మారి మరోవైపు.. తాజాగా విమాన ప్రమాదం. ఓ కష్టం ఎదురయ్యిందంటే చాలు జనాలు కులం, మతం, వర్గంతో సంబంధం లేకుండా రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభిస్తారు. ఇదే నా కేరళ మోడల్‌ ’అంటూ అభినందిస్తూ ట్వీట్‌ చేశారు. 
 

మరిన్ని వార్తలు