ఎలక్ట్రిక్‌ స్కూటర్‌కు ‘పొల్యూషన్‌’ జరిమానా.. నవ్వులపాలైన పోలీసులు

10 Sep, 2022 06:26 IST|Sakshi

మలప్పురం: పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వాలు ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. రాయితీలు కూడా అందిస్తున్నాయి. మరి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌కు పొల్యూషన్‌ అండర్‌ కంట్రోల్‌(పీయూసీ) సర్టిఫికెట్‌ లేదని జరిమానా విధిస్తే?! కేరళ పోలీసులు ఇదే పనిచేసి నవ్వులపాలయ్యారు. మలప్పురం జిల్లాలో కరువరాకుండు పోలీసు స్టేషన్‌ పరిధిలోని నీలాంచెరీలో గతవారం ఓ వ్యక్తి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌పై వస్తుండగా తనిఖీల్లో భాగంగా పోలీసులు ఆపేశారు.

పీయూసీ సర్టిఫికెట్‌ లేదంటూ ప్రింటౌట్‌ చేతిలో పెట్టి, రూ.250 వసూలు చేశారు. ఈ ఉదంతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసుల నిర్వాకంపై జోకులు పేలాయి. టైపింగ్‌ మిస్టేక్‌ వల్లే ఇదంతా జరిగిందని పోలీసులు వివరణ ఇచ్చారు. స్కూటర్‌ యజమాని డ్రైవింగ్‌ లైసెన్స్‌ చూపించలేకపోయాడని చెప్పారు. మెషిన్‌లో తప్పుగా టైప్‌ చేయడంతో పీయూసీ సర్టిఫికెట్‌ లేదంటూ ప్రింటౌట్‌ వచ్చిందని అన్నారు.

మరిన్ని వార్తలు