ది కేరళ స్టోరీ విడుదల వివాదం.. తమిళనాడు ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్‌ హెచ్చరిక

3 May, 2023 12:55 IST|Sakshi

ది కేరళ స్టోరీ సినిమాపై రాజకీయ దుమారం చల్లారడం లేదు. ఎక్కడ విన్నా ఇప్పుడు ‘ది కేరళ స్టోరీ’ పేరే మార్మోగుతోంది. అంతలా సినిమాను వివాదాలు చుట్టుముట్టాయి.  మే 5న విడుదల కానున్న ఈ సినిమాను రిలీజ్‌ చేయవద్దంటూ  కేరళ ప్రభుత్వంతో సహా కాంగ్రెస్‌, సీపీఐ వంటి పార్టీలు, ముస్లిం సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ది కేరళ స్టోరీ విద్వేషపూరితంగా చీత్రికరించారని, సినిమా విడుదల చేస్తే సమాజంలో మత సామరస్యాలు దెబ్బతింటాయంటూ ఏకంగా సుప్రీంకోర్టునే ఆశ్రయించారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 

తాజాగా ఈ సినిమా వివాదం కేరళలోనే కాకుండా పక్క రాష్ట్రమైన తమిళనాడుకు కూడా పాకింది. రిలీజ్‌ డేడ్‌ సమీపిస్తన్న తరుణంలో తమిళనాడు ప్రభుత్వాన్నికి ఇంటెలిజెన్స్‌ బృందాలు అలెర్ట్‌ జారీ చేశాయి. తమిళనాడులో మూవీ విడుదలైతే రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు, నిరసనలు చెలరేగే ప్రమాదం ఉందని హెచ్చరించాయి.  తమిళనాడులో కేరళ స్టోరీ సినిమాను విడుదల చేయకుండా అడ్డుకోవాలని ప్రభుత్వానికి సూచన చేసింది.

అయితే ఇప్పటి వరకు తమిళనాడులో సినిమాను విడుదల చేసేందుకు  ఎవరూ ముందుకు రాలేదని రాష్ట్ర పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ రిలీజ్‌ చేస్తే వచ్చే సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన్నట్లు తెలిపాయి.  అన్ని థియేటర్లలో పీఎస్‌-2(పొన్నియన్‌ సెల్వన్‌) నడుతస్తోందని, ప్రభుత్వంతోపాటు ధియేటర్‌ యాజమానులు ది కేరళ స్టోరీని ఇప్పట్లో రిలీజ్‌ చేసేందుకు ఆసక్తి కనబరచడం లేదని పేర్కొన్నాయి.

బ్యాన్‌ కోరుకోవడం లేదు.. కానీ
సినిమా మేకర్స్‌పై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సైతం విమర్శలు గుప్పించారు. ఈ సినిమా హిందూ, ముస్లిం మధ్య ద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందని, దీనిని ఆర్ఎస్ఎస్, బీజేపీ అబద్ధపు ప్రచారంగా అభివర్ణించారు. తిరువనంతపురం కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌కూడా సినిమాను వ్యతిరేకిస్తూ ట్వీట్‌ చేశారు. కేరళను తప్పుగా చిత్రీకరిస్తూ చిత్రాన్ని రూపొందించారని విమర్శించారు. తాను సినిమాను బ్యాన్‌ చేయాలని కోరుకోవడం లేదంటూనే.. భావప్రకటనా స్వేచ్ఛను తప్పుగా చిత్రీకరించారదని మండిపడ్డారు. వాస్తవికతను తప్పుగా చూపించారని, దీనిపై గొంతెత్తి నినాదించే హక్కు కేరళ ప్రజలకు ఉందని ఉందని తెలిపారు. మరోవైపు ది కేరళ స్టోరీ చిత్రానికి బీజేపీ మద్దతిస్తోంది.

కాగా సుదీప్తోసేన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రలో నటించారు విపుల్‌ అమృత్‌లాల్‌ షా నిర్మాతగా వ్యవహరించారు. కేరళలో 2016-17 మధ్య 32 వేల మంది మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడ అనే నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు.

ఓ నలుగురు యువతులు మతం మారి ఐసిస్‌లో చేరి ఉగ్రవాద శిక్షణ పొంది, భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాల కోసం పనిచేస్తున్నారనే కోణంలో కథ చూపించడం వివాదానికి దారితీసింది. ది కేరళ స్టోరీ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ ఏప్రిల్‌ 26న విడుదలవ్వగా అప్పటి నుంచే దీనిపై రాజకీయ రగడ మొదలైంది. అయితే ఎట్టకేలకు ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డు అనుమతి ఇవ్వడంతో మే5న విడుదలకు సిద్ధంగా ఉంది. 

మరిన్ని వార్తలు