కాఫీ క్యాప్సూల్‌: ఇక పర్సులో కూడా కాఫీ తీసుకెళ్లొచ్చు

21 Jul, 2021 13:47 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

క్యాప్సూల్‌ ఫిల్టర్‌ కాఫీ

తిరువంతనపురం: ప్రస్తుత విద్యా విధానాన్ని యాంత్రికతతో పోల్చుతుంటారు. ఇది ఏ మాత్రం సృజన లేని విధానం వైపుగా వెళుతోందని, పిల్లలు కీ ఇచ్చే బొమ్మల్లా తయారవుతున్నారని వాపోయే వారూ ఉన్నారు. అలాంటిది కేరళ ఎర్నాకుళంలోని ప్రభుత్వ బాలికల హయ్యర్‌ సెకండరీ పాఠశాల 12వ తరగతి విద్యార్థినులు నలుగురు కలిసి ఫిల్టర్‌ కాఫీ క్యాప్సుల్‌ను తయారు చేసి, అంతర్జాతీయ గుర్తింపు పొందారు. 

సౌందర్య లక్ష్మి, ఎలిషా అనోరీ కడుతోస్, దింపాల్, శివనందన్‌.. ఈ నలుగురు అమ్మాయిలు కాఫీ షాపులకు కూడా వెళ్లలేదు కానీ, కాఫీ ప్రేమికులు తమ అభిమాన పానీయాన్ని సేవించడానికి, ఆ ఆస్వాదనలో మునిగిపోవడానికి సహాయపడే విధంగా ఒక కొత్త ఉత్పత్తిని తీసుకు వచ్చి, కాఫీ ప్రియుల ప్రశంసలు అందుకుంటున్నారు. 

తేయాకుతో ప్రయోగాలు
‘అమెరికాలో జరిగే టై గ్లోబల్‌ ప్రపంచవ్యాప్తంగా తమ వ్యాపార పరిధిని పెంచే విషయంలో కొత్త కొత్త ఆహ్వానాలు కోరింది. మన దేశం నుంచి వచ్చిన వాటిలో ఎనిమిది ఐడియాలను తీసుకుంది. వాటిలో ఈ స్కూల్‌ విద్యార్థుల బృందం చేసిన ఉత్పత్తి ఫిల్టర్‌ కాఫీ క్యాప్సూల్‌. ఈ విద్యార్థులు అందించిన ‘కాఫీ పిల్‌’ కు మంచి ఆదరణ లభించింది. ఇది ఫిల్టర్‌ కాఫీని క్యాప్సూల్‌లో ప్యాక్‌ చేయడానికి వీలుగా ఉంటుంది. 

దీని ఉత్పత్తికి, రూపకల్పనకు చేసిన కృషిని ఈ బృంద నాయకురాలు సౌందర్య వివరిస్తూ ‘మా స్కూల్‌ వద్ద ఓ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి, కొత్త ఐడియాలు కోరారు. అయితే, అంతకుముందే మా సొంత వ్యాపారంతో ముందుకు రావాలన్న ఆలోచనలో ఉన్న మేము తేయాకులతో రకరకాల ప్రయోగాలు చేశాం. ముందు ఒక చిన్న బంతిలో టీ ఆకులను జొప్పించి, కప్పు నీళ్లతో టీని తయారు చేశాం’ అని సగర్వంగా చెబుతోంది.

సేంద్రియ పద్ధతిలో కాఫీ
‘ఇది పూర్తిగా సేంద్రియ పద్ధతి. కాగితం లేదా ఇతర హానికారక పదార్థాలేవీ ఉపయోగించలేదు. మా పరిశోధన చాలా విస్తృతంగా జరిగింది. బంతి పరిమాణం నుంచి సాచెట్‌లోకి తీసుకువచ్చాం. ఆ తర్వాత క్యాప్సూల్‌ అయితే ఉపయోగకరంగా ఉంటుందని, పర్స్‌లో పెట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు అనే ఆలోచనకు వచ్చాం. ఈ క్యాప్సూల్‌ని వేడినీటిలో వేసినప్పుడు కరిగిపోయి, డికాషన్‌ తయారవుతుంది. ఈ విధానం వల్ల వ్యర్థాలు ఉత్పత్తి అయ్యే సమస్యే తలెత్తదు. ఇది మంచి వ్యాపార ఆలోచనగా గుర్తించాం’ అని తెలియజేసే ఈ పరిశోధక బృందం తమ ప్రొడక్ట్‌కు లోగోను కూడా జోడించి ట్రేడ్‌మార్క్‌ లైసెన్స్‌ కి సబ్‌మిట్‌ చేశారు. ‘12 వ తరగతి పూర్తి చేసిన తర్వాత మేం మా వ్యాపార ఆలోచనను పూర్తిస్థాయి వెంచర్‌గా మారుస్తాం’ అని ఈ బృందం సంతోషంగా తమ సృజన గురించి వివరిస్తోంది. 
 

మరిన్ని వార్తలు