తల్లిదండ్రులు కాబోతున్న ట్రాన్స్‌జెండర్ జంట.. దేశంలోనే తొలిసారి..

3 Feb, 2023 21:32 IST|Sakshi

తిరువనంతపురం: కేరళకు చెందిన జియా, జహద్ అనే ట్రాన్స్‌జెండర్ జంట త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. మార్చిలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. జియా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. వీరిద్దరూ మూడేళ్లుగా కలిసి జీవిస్తున్నారు.

పుట్టుకతో మగ అయినా జియా.. లింగమార్పిడి చేయించుకుని  అమ్మాయిగా మారుతోంది.  మరోవైపు అమ్మాయిగా పుట్టిన జహద్ కూడా లింగ మార్పిడి చేయించుకుని అబ్బాయిగా మారుతున్నాడు. అయితే  ఈ క్రమంలో గర్భం దాల్చడంతో బిడ్డ కోసం లింగ మార్పిడి ప్రక్రియను నిలిపివేశారు. ఫలితంగా  దేశంలోనే గర్బం దాల్చిన తొలి ట్రాన్స్‌మన్‌గా జహద్‌ నిలిచారు.

అయితే అబ్బాయిలా మారాలనుకున్నందున శస్త్రచికిత్సలో భాగంగా జహద్ వక్షోజాలను ఇప్పటికే తొలగించారు. గర్భాశయాన్ని కూడా తొలగించే లోపే జహద్ గర్భందాల్చడంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది. దీంతో పుట్టబోటే బిడ్డకు దాతల ద్వారా పాలు సమాకూర్చుకుంటామని ఈ జంట చెబుతోంది.

తాను పుట్టుకతో అమ్మాయి కాకపోయినప్పటికీ బిడ్డతో అ‍మ్మ అని పిలుపించుకోవాలని కలలు కనేదాన్నని జియా చెప్పింది. జహద్‌ కూడా నాన్న కావాలనుకున్నాడని పేర్కొంది. ఎట్టకేలకు తమ కల నేరవేరిందని, మరో నెలలో బిడ్డకు జన్మనిస్తామని ఆనందం వ్యక్తం చేసింది.

బిడ్డ దత్తత కోసం ప్రయత్నాలు..
ఈ జంట కొద్దికాలంగా ఓ బిడ్డను దత్తత తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే వీరు ట్రాన్స్‌జెండర్ అయినందున దత్తత ప్రక్రియ సవాల్‌గా మారింది. బయోలాజికల్‌గా జహద్ ఇంకా అమ్మాయే కావడంతో సాధారణ బిడ్డకు జన్మనిచ్చే అవకాశముందని భావించారు. అబ్బాయిగా మారాలనుకున్న జహద్ ఆలోచనను జియా తాత్కాలికంగా వాయిదా వేయించారు.

ఇద్దరి ట్రాన్స్‌జెండర్ ప్రక్రియ ఇంకా పూర్తి కానందున పుట్టబోయో బిడ్డకు ఎలాంటి ఇబ్బంది లేదని కోజికోడ్ మెడికల్ కాలేజీ వైద్యులు తెలిపారు. అంతా సాధారణంగానే జరుగుతుందని చెప్పారు.
చదవండి: మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగికి షాక్‌! అటు ఉద్యోగం, ఇటు పెళ్లి చేసుకునే పిల్లా? ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు!

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు