స్పెషల్‌ మూమెంట్‌.. తల్లీకొడుకులకు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగం

8 Aug, 2022 19:14 IST|Sakshi

తిరువనంతపురం: ఎవరైనా ప్రభుత్వం ఉద్యోగం సాధిస్తే ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు ఉండవు. ఒక్కోసారి ఒకే ఇంట్లో ఇద్దరు, లేదా ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తారు. కానీ, ఒకేసారి తల్లీకొడుకులకు ఉద్యోగం రావటం చూశారా? అవునండీ.. కేరళలో ఈ సంఘటన జరిగింది. మలప్పురమ్‌కు చెందిన బిందు అనే మహిళ, ఆమె కుమారుడు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగం సాధించారు.

బిందు తన కుమారుడు 10వ తరగతి చదువుతున్న సమయంలో అతడిని ప్రోత్సహించేందుకు పుస్తకాలు చదవటం ప్రారంభించారు. అదే ఆమెను కేరళ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(పీఎస్‌సీ) పరీక్షలవైపు మళ్లించింది. తొమ్మిదేళ్ల తర్వాత కుమారుడితో పాటు ఉద్యోగం సాధించారు.  42 ఏళ్ల బిందు.. లాస్ట్‌ గ్రేడ్‌ సర్వెంట్‌(ఎల్‌జీఎస్‌) పరీక్షలో 92వ ర్యాంకు సాధించారు. 24 ఏళ్ల ఆమె కుమారుడు లోవర్‌ డివిజనల్‌ క్లర్క్‌(ఎల్‌డీసీ) పరీక్షలో 38వ ర్యాంక్‌ సాధించాడు. ఈ విషయాన్ని ఓ టీవీ ఇంటర్వ్యూలో వెల్లడించారు బిందు. 

కుమారుడిని ప్రోత్సహించేందుకు చదువు మొదలు పెట్టిన బిందు.. ఆ తర్వాత కోచింగ్‌ సెంటర్‌లో చేరారు. కుమారుడి డిగ్రీ పూర్తవగానే అతడిని సైతం కోచింగ్‌ సెంటర్‌లో చేర్పించారు. రెండు సార్లు ఎల్‌జీఎస్‌, ఒకసారి ఎల్‌డీసీ పరీక్ష రాసినా ఉత్తీర్ణత సాధించలేకపోయారు. నాలుగో సారి విజయాన్ని అందుకున్నారు. అయితే.. తన లక్ష‍్యం ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ పరీక్ష అని... ఎల్‌జీఎస్‌ బోనస్‌ అని పేర్కొన్నారు బిందు. గత 10 ఏళ్లుగా అంగన్‌వాడీ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

ఇదీ చదవండి: Lucknow Hospital Video: బర్త్‌ డే పార్టీ పేరుతో ఆసుపత్రిలో విద్యార్థుల హల్‌చల్‌.. వీడియో వైరల్‌!

మరిన్ని వార్తలు