వైరలవుతున్న కేరళ బామ్మ ఆవేదన

11 Oct, 2020 17:35 IST|Sakshi

తిరువనంతపురం : సోషల్‌ మీడియా విసృతిలో చెడుకు ఎంత అవకాశం ఉంటుందో మంచికి అంతే అవకాశం ఉంటుంది. సోషల్‌ మీడియా ద్వారా కొంతమంది జీవితాలు మెరుగుపడ్డాయనడంలో సందేహం లేదు. ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితులు తలకిందులు కావడంతో చాలా మంది ఉపాధి కోల్పోయారు. ఈ నేపథ్యంలో వారి ఆవేదనను సోషల్‌ మీడియాలో వ్యక్తం చేయగానే మంచి మనసున్న నెటిజన్లు కొందరు వారికి సాయం చేయడానికి ముందుకు వచ్చేవారు. ఎవరి నుంచి ఆశించకుండా కష్టపడి బతికేవారికి దేవుడే ఏదో ఒక ఉపాధి చూపిస్తాడనడానికి ఈ వార్త ఉదాహరణ.

ఇక అసలు విషయంలోకి వెళితే.. కేరళకు చెందిన పార్వతీ అమ్మ అనే 70 ఏళ్ల బామ్మ ఎవరిపై ఆధారపడకుండా  మన్నార్కాడ్ సమీపంలోని కరింబా వద్ద ధాబాను నడిపేవారు. ఆమె చేతి వంటను ధాబాకు వచ్చే కస్టమర్లు మెచ్చకోకుండా ఉండేవారు కాదు. ధాబాపై వచ్చే లాభాలతోనే తన కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చేది. కానీ కరోనా వచ్చి ఆమె జీవితాన్ని సంక్షోభంలోకి నెట్టింది. ధాబాలు తెరిచినా కస్టమర్లు రావడానికి భయపడుతుండడంతో ఆమె ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. (చదవండి : సోషల్ మీడియానా మజాకా: వైరల్ వీడియో)

దీంతో పార్వతీ అమ్మ సోషల్‌ మీడియా ద్వారా తన ఆవేదనను పంచకున్నారు. 'మీ అందరికి ఒక విజ్ఞప్తి.  ఎంతో కష్టపడి డాబాను నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ఏనాడు ఎవరి దగ్గర చేయి చాపలేదు. కానీ పాడు కరోనా మా జీవితాలను కుదిపేసింది. మీరందరిని నేను కోరేది ఒకటే.. కస్టమర్లు నా ధాబాకు వచ్చేలా ఈ వీడియోనూ ప్రమోట్‌ చేయండి.. నా కుటుంబాన్ని ఆదుకోండి.. అందుకు ప్రతిఫలంగా నా చేతి వంటను మీకు రుచి చూపిస్తానంటూ ' పార్వతీ చెప్పుకొచ్చారు.

అయితే పార్వతీ అమ్మను కలిసిన ఆరిఫ్‌ షా అనే జర్నలిస్ట్‌ ఆమె మాటలను వీడియో తీసి ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ఇది కేరళ స్టోరీ.. మరో బాబా కా ధాబా స్టోరీ.. ఆమెను ఆదుకుందాం నాతో చేతులు కలపండి అంటూ క్యాప్షన్‌ జత చేశారు. ఆరిఫ్‌ షా షేర్‌ చేసిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బాబా కా ధాబాకు అందిన సాయం లాగే కేరళ బామ్మకు సాయం చేద్దామంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు. దక్షిణాది హీరోయిన్‌ రిచా చద్దా కూడా కేరళ బామ్మను ఆదుకోవాలంటూ ఆమె వీడియోను షేర్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు.

కాగా మొన్నటికి మొన్న ఇదే తరహాలో ఢిల్లీలోని మాలవీయనగర్‌లో ఉన్న బాబాకా ధాబా గురించి ట్విటర్‌లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. కరోనా, లాక్‌డౌన్ కారణంగా డిమాండ్ లేక షాపు యజమాని కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలో షేర్ చేశారు. దాదాపు 80 ఏళ్ళ వృద్ధాప్యంలో జీవనం కోసం ఆ జంట పడుతున్న ఆరాటాన్ని చూపించారు. అంతేకాదు వీరిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ వీడియో క్షణాల్లో వైరలయ్యి.. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు బాబా కా ధాబాకు పోటెత్తుతున్నారు.

మరిన్ని వార్తలు