బస్సుకిందపడ్డ మహిళ.. చక్రంలో ఇరుక్కున్న జుట్టు.. అంతా క్షణాల్లో..

31 Jan, 2023 20:48 IST|Sakshi

తిరువనంతపురం: కేరళ కొట్టాయంకు చెందిన ఓ మహిళ జీవితంలో మిరాకిల్ జరిగింది.  బస్సు ఢీకొట్టి దాని కిందపడినా అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. ఈమె జుట్టు బస్సు చక్రంలో ఇరుక్కుపోగా.. స్థానికులు చేశారు. తాను ఇంకా బతికి ఉన్నానంటే నమ్మలేకపోతున్నానని మహిళ ఆనందంతో పాటు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అంతా క్షణాల్లో జరిగిపోయిందని చెప్పింది.

కొట్టాయం సమీపంలోని చింగవరానికి చెందిన ఈ మహిళ పేరు కే అంబిలి. స్కూల్ బస్సులో హెల్పర్‌గా పనిచేస్తోంది. రద్దీగా ఉన్న రోడ్డుపై ఓ చిన్నారిని దాటించే సమయంలో ఆర్టీసీ బస్సు ఈమెను ఢీకొట్టింది. దీంతో ఆమె బస్సుకింద పడిపోయింది. డ్రైవర్ వెంటనే సడెన్ బ్రేక్ వేశాడు. అదృష్టవశాత్తు బస్సు ముందు చక్రం ఆమెపైనుంచి వెళ్లలేదు. అయితే జుట్టు మాత్రం చక్రంలో ఇరుక్కుపోయింది.

స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని మహిళకు సాయం చేశారు. ఓ బార్బర్‌ను పిలిపించారు.  అతను బస్సు కిందకు వెళ్లి చక్రంలో ఇరుక్కున్న మహిళ జుట్టును కత్తిరించాడు. దీంతో మహిళ క్షేమంగా బయటపడింది. స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి.
చదవండి: విమానంలో మహిళపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తికి బెయిల్..

మరిన్ని వార్తలు