భర్తతో వీడియో కాల్‌.. ఇంట్లోకి దూసుకొచ్చిన రాకెట్

12 May, 2021 12:08 IST|Sakshi

భర్తతో భార్య వీడియో కాల్‌

వీడియో కాల్‌ మాట్లాడుతుండగా దూసుకొచ్చిన రాకెట్‌

గాజా పేలుళ్లలో కేరళ మహిళ మృతి

గాజా సిటీ : ఇజ్రాయిల్ ‌- పాలస్తీనా మధ్య వైషమ్యాలు అక్కడ రక్తపుటేరులు పారిస్తున్నాయి. ఇరు ప్రాంతాల మధ్య జరిగిన దాడుల్లో 28 పాలస్తీనియన్లు మరణించారు. వారిలో 16 మంది ఉగ్రవాదులేనని ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. అయితే మరణించిన వారిలో కేరళకు చెందిన మహిళ సౌమ్య కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

కేరళలోని ఇడుక్కి జిల్లా కీరితోడుకు చెందిన ఎంఎస్ సౌమ్య ఏడేళ్లుగా ఇజ్రాయెల్‌ అష్కెలోన్ నగరంలో పని మనిషిగా చేస్తోంది. తాజాగా పాలస్తీనా జరిపిన రాకెట్‌ దాడిలో ఆమె మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అష్కెలోన్ నగరంలో తన నివాసంలో ఉన్న సౌమ్య మంగళవారం సాయంత్రం భర్త సంతోశ్‌తో వీడియో కాల్‌ మాట్లాడుతుండగా పాలస్తీనా వదిలిన రాకెట్‌ ఆమె ఇంట్లో పడి పేలింది. ఒక్కసారిగా పేలడంతో ఆ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.   

"వీడియో కాల్ సమయంలో నా తమ్ముడు భారీ శబ్ధం విన్నాడు. అకస్మాత్తుగా సౌమ్య ఫోన్‌ డిస్‌ కనెక్ట్‌ అయ్యింది. దీంతో భయాందోళనకు గురైన మేం సౌమ్య స్నేహితులకు ఫోన్‌ చేశాం. ఈ ఘటనలో ఆమె మృతి చెందింది అని వారు చెప్పారు’ అని సౌమ్య బావ సాజీ స్థానిక మీడియాతో తెలిపారు. 

మరిన్ని వార్తలు