మహిళపై రెచ్చిపోయిన ఉన్మాది,15 కత్తి పోట్లు, చివరికి..

31 Aug, 2021 17:10 IST|Sakshi
నిందితుడు అరుణ్‌ (ఫోటో కర్టసీ న్యూస్‌ మినిట్‌)

కేరళలో అమానుషం, ఉన్మాది అకృత్యానికి బలైన మహిళ

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన బాధితురాలు

తిరువనంతపురం: కేరళలో మరో ఉన్మాది రెచ్చిపోయాడు. తనతో పెళ్లికి నిరాకరించిందన్న అక్కసుతో మహిళపై దారుణానికి తెగబడ్డాడు. గతంలో కూడా వేధింపులకు పాల్పడిన నిందితుడు సమయం చూసి ఇంట్లోకి చొరబడి మరీ బాధితురాలిని పొట్టన పెట్టుకున్న ఘటన విషాదాన్ని నింపింది. పెద్దమాల పోలీస్ స్టేషన్ పరిధిలోని కరీపూర్ సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. 

కుటుంబసభ్యుల సమాచారం ప్రకారం  నాలుగేళ్ల క్రితం తిరువనంతపురానికి చెందిన సూర్యగాయత్రిని పెళ్లి చేసుకుంటానంటూ ఆమె కుటుంబాన్ని సంప్రదించాడు నిందితుడు, పెయాడ్‌కు చెందిన అరుణ్‌(29).అయితే ఈ ప్రతిపాదనను వారు తిరస్కరించారు. దీంతో అరుణ్‌ వేధింపుల పర్వం మొదలైంది. దీనికి తోడు తన స్మార్ట్‌ఫోన్‌, బంగారు నగలు దొంగిలించాడంటూ నాలుగేళ్ల క్రితమే సూర్యగాయత్రి తల్లి తిరువనంతపురంలోని ఆర్యనాడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, అప్పట్లో  కేసు నమోదు చేయని పోలీసులు అరుణ్‌కు కౌన్సిలింగ్‌  ఇచ్చి వదిలివేశారు. 

ఆ తరువాత కొంత కాలానికి సూర్యగాయత్రి మరొక వ్యక్తిని వివాహం చేసుకోగా, అరుణ్ కూడా వివాహం చేసుకున్నాడు. అయితే భర్తతో  విబేధాల కారణంగా సూర్య గాయత్రి ఇటీవల పుట్టింటికి తిరిగి వచ్చింది. దీంతో అరుణ్ మళ్లీ ఆమె వెంటపడటం మొదలు పెట్టాడు. తనతో సంబంధం పెట్టుకోవాలని బెదిరించాడు. దీనికి నిరాకరించడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. అదును చూసి ఎటాక్‌ చేసి కత్తితో ఏకంగా 15 సార్లు పొడిచాడు. వెంటనే స్పందించిన పొరుగువారు అరుణ్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన సూర్యగాయత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూసింది. అరుణ్‌పై అంతకు ముందే క్రిమినల్‌ కేసులున్న నేపథ్యంలో అతని పెళ్లి ప్రస్తావనను తిరస్కరించామని గాయత్రి తల్లి వల్సల తెలిపారు. అరుణ్‌ దాడిలో గాయ పడిన వల్సల ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. అయితే తనను అవమానించినందుకే ప్రతీకారం తీర్చుకున్నానని  పోలీసుల విచారణలో నిందితుడు తెలిపాడని చెప్పారు. 

మరిన్ని వార్తలు