‘ప్రియురాలి’తో మహిళ.. తీసుకెళ్లిన పోలీసులు

27 Oct, 2020 19:08 IST|Sakshi

తిరువనంతపురం: చెన్నైలో ఒక షాకింగ్‌ సంఘటన చోటు చేసుకుంది. స్వలింగ సంబంధంలో ఉన్న 22 ఏళ్ల కేరళ మహిళను పోలీసు అధికారులు తన భాగస్వామి ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. ఈ సంఘటన శనివారం చోటు చేసుకుంది. కేరళకు చెందిన ఇద్దరు పోలీసు అధికారులు ఓ మహిళా పోలీసుతో కలిసి వచ్చి 22 ఏళ్ల యువతిని తమతో బలవంతంగా తీసుకెళ్లారు. కోజికోడ్‌ నివాసి అయిన ఈ మహిళ ఓ యువతితో ప్రేమలో ఉంది. అయితే ఈ బంధాన్ని సదరు యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దాంతో ఆమె అక్టోబర్‌లో తల్లిదండ్రుల ఇంటి నుంచి వెళ్లిపోయి.. చెన్నైలో ఉంటున్న భాగస్వామి వద్దకు చేరుకుంది. 20 రోజుల తర్వాత పోలీసులు చెన్నై వెళ్లి ఆమెను తీసుకెళ్లి కేరళ కోర్టులో హాజరుపరిచారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సదరు యువతి తన ఇష్టం మేరకే మరో మహిళతో కలిసి జీవించడానికి చెన్నై వెళ్లింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెను కోర్టులో హాజరుపర్చాల్సి ఉన్నప్పటికి ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా తీసుకు రావడంతో ఈ సంఘటన వివాదాస్పదంగా మారింది. అంతేకాక పోలీసులు బాధితురాలికి, ఆమె భాగస్వామికి లీగల్‌ సాయం తీసుకునే అవకాశం కూడా కల్పించలేదు. (చదవండి: వివక్షపై విజయానికి రెండేళ్లు..)

ఇక ఆదివారం కోర్టులో హాజరయిన సదరు యువతి చెన్నై వెళ్లిపోవడానికి ముందు 10 రోజుల పాటు తన తల్లిదండ్రులతో కలిసి ఉంటానని మెజిస్ట్రేట్‌ ముందు తెలిపింది. ఇలాంటి సందర్బాల్లో ​తల్లిదండ్రులు, బంధువులు పోలీసుల సాయంతో ఎల్‌జీబీటీక్యూఐఏ యువత హక్కులు, స్వేచ్ఛను హరిస్తున్నారు. కేరళ బాధితురాలి విషయంలో కూడా ఇదే జరిగింది. మేజర్‌ అయిన యువతి తన ఇష్టం మేరకే చెన్నైలో ఉంటున్న భాగస్వామి దగ్గరకు వెళ్లింది. కానీ పోలీసులు మాత్రం తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సదరు యువతి ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా ఆమెను ఇంటికి తీసుకువచ్చారు. అయితే 2018లో ఇలాంటి కేసులో కేరళ హై కోర్టు బాధితురాలికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయినప్పటికి ఇలాంటి సంఘటనలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు