ప్రేమ ఒకరితో.. మరొకరితో ఎంగేజ్‌మెంట్‌.. చివరికి ప్రియుడి ప్రాణం ‘చిత్రం’గా తీసిందిలా!

29 Oct, 2022 16:06 IST|Sakshi

ప్రేమ మత్తులో మునిగిన యువకుడు.. అందులోంచి బయట పడలేకపోయాడు. ఆమె కోసం పరితపించిపోయి పిచ్చి ప్రేమను ప్రదర్శించాడు. చివరికి.. ప్రేమ పేరిట ఆమె ఆడిన నాటకంలో ఆ భగ్న ప్రేమికుడు కాస్త.. బలి పశువు అయ్యాడు. ప్రాణాల కోసం ఆస్పత్రిలో రోజుల తరబడి పోరాడి.. చివరకు కన్నుమూశాడు.

కేరళ తిరువనంతపురంలో ఓ యువకుడి మరణం కేసు.. మిస్టరీగా మారింది. అతనెలా మరణించాడన్నది ఎటూ తేల్చలేకపోతున్నారు పోలీసులు. అయితే బాధిత కుటుంబం మాత్రం మూఢనమ్మకంతో.. ప్రియురాలే తమ బిడ్డ ప్రాణం తీసిందని అంటోంది. పరసాలాకు చెందిన షరోన్‌ రాజ్‌(23) గత కొంతకాలంగా ఉష అనే ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. వృత్తి రిత్యా వేరే ఊర్లో ఉంటున్న షరోన్‌కి.. ఈమధ్య ఆమెకు మరో వ్యక్తితో ఎంగేజ్‌ మెంట్‌ అయ్యిందని విషయం తెలిసి షాకయ్యాడు. ఈలోపే ఉష అతనికి కాల్‌ చేసింది. తనకు ఇష్టం లేకుండా ఇంట్లో వాళ్ల బలవంతం మేరకు ఎంగేజ్‌మెంట్‌ జరిగిపోయిందని చెప్పింది. దీంతో అప్పటి నుంచి అతను ఆమెకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. 

అయితే.. ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు షరోన్‌ దగ్గర ఉన్నాయి. వాటి వల్ల ఎప్పటికైనా ప్రమాదం అనుకుందో ఏమో.. అతనితో వాట్సాప్‌ ఛాటింగ్‌ ద్వారా దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో.. అక్టోబర్‌ 10న షరోన్‌ పరసాలాకు వచ్చాడు. అక్టోబర్‌ 14న ఉదయం షరోన్‌కు ఉష ఫోన్‌ చేసింది. కలవాలని ఉందని.. బయటకు వెళ్దామని చెప్పింది. అయితే బైక్‌ సర్వీసింగ్‌కు ఇచ్చానని చెప్పడంతో ఫోన్‌ పెట్టేసింది. 

కాసేపు ఆగి మళ్లీ ఫోన్‌ చేసి ఇంట్లో ఎవరూ లేరు.. రమ్మని ఆహ్వానించింది. స్నేహితుడితో కలిసి రామవర్మంచిరై(కన్యాకుమారి, తమిళనాడు)లో ఉష ఇంటికి వెళ్లాడు షరోన్‌. స్నేహితుడు బయట ఎదురుచూస్తుండగా.. ఒక్కడే ఇంట్లోకి వెళ్లాడు. అయితే.. పావు గంటకు పొట్టచేత పట్టుకుని వాంతులు చేసుకుంటూ బయటకు వచ్చాడు షరోన్‌.  ఆ తర్వాత కూడా ఇద్దరూ చాట్‌ చేసుకున్నారు. కషాయం, జ్యూస్‌ల్లో ఏం కలిపావని షరోన్‌ ఉషను నిలదీశాడు. అయితే తానేం కలపలేదని.. బహుశా పండ్ల రసం వికటించిందేమో అని సమాధానం ఇచ్చింది ఆమె. అక్కడితో వాళ్లిద్దరి ఛాటింగ్‌ ఆగిపోయింది. దారి పొడవునా నీలి రంగులో వాంతులు కావడంతో.. షరోన్‌ను పరసాలా ప్రభుత్వాసుపత్రిలో చేర్చాడు ఆ స్నేహితుడు. ఆపై తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే.. అక్కడ బ్లడ్‌ టెస్ట్‌ రిపోర్ట్‌లు నార్మల్‌ రావడంతో.. ఇంటికి పంపించేశారు. 

ఆ తర్వాత రెండు రోజులకు షరోన్‌ పరిస్థితి విషమించడంతో.. తిరిగి తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్‌ ఆస్పత్రికి తరలించారు అతని పేరెంట్స్‌. 11 రోజుల పాటు చికిత్స పొందిన షరోన్‌కు లంగ్స్‌, కిడ్నీ ఒక్కొక్కటిగా దెబ్బ తింటూ వచ్చాయి. ఈలోపు షరోన్‌ నుంచి మెజిస్ట్రేట్‌ సమక్షంలో వాంగ్మూలం సేకరించారు పోలీసులు. మరోవైపు వైద్యులు.. అతను తాగిన డ్రింక్‌లో యాసిడ్‌లాంటిది కలిసిందని నిర్ధారించారు. అయితే ఏం కలిపారనే దానిపై మాత్రం స్పష్టత రాలేదింకా. ఇక ఈ కేసులో పోలీసుల తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల దర్యాప్తు పూర్తిగా నిందితుల కుటుంబానికి అనుకూలంగా ఉందని ఆరోపిస్తోంది బాధిత కుటుంబం. అంతేకాదు.. పరారీలో ఉన్న ఉష కుటుంబాన్ని పోలీసులు ఇంతదాకా ట్రేస్‌ చేయలేకపోయారు. 

ఆ గండం గట్టెక్కేందుకే.. 
ఉష కుటుంబానికి షరోన్‌ రాజ్‌ నచ్చలేదు. అందుకే మరో వ్యక్తితో ఉషకు పెళ్లి ఫిక్స్‌ చేసి.. ఎంగేజ్‌మెంట్‌ కూడా కానిచ్చేశారు. పెళ్లి సెప్టెంబర్‌లోనే జరగాల్సి ఉండగా.. ఆఖరి నిమిషంలో ఎందుకనో ఫిబ్రవరికి వాయిదా వేశారు. దీంతో.. తమ బిడ్డ మరణం వెనుక మూఢనమ్మక కోణం కూడా ఉందని షరోన్‌ కుటుంబం ఆరోపిస్తోంది. ఉషకు పెళ్లైన వెంటనే భర్త మరణించే గండం ఉందని, ఆ దోషం పొగొట్టేందుకు తమ బిడ్డతో బలవంతంగా ఆమె నుదుట కుంకుమ పెట్టించారని షరోన్‌ కుటుంబం అంటోంది. ఉష ఇంటి నుంచి బయటకు వచ్చిన షరోన్‌ నుదుటిపై కూడా కుంకుమ ఉందని, ఆ విషయాన్ని కూడాఉన్న స్నేహితుడు సైతం నిర్ధారించాడని అంటోంది. ఇంటికి పిలిపించి మరీ పక్కా ప్లాన్‌తో ఉషతో బలవంతపు వివాహం జరిపించి.. ఆపై ఏదో తాగించి షరోన్‌ మరణానికి కారణమయ్యారని ఆరోపిస్తోంది.

ఇలాంటిదే మరో ఘటన.. 
షరోన్‌ రాజ్‌తో పాటు మరో చిన్నారి మృతి కేసు కూడా కేరళలో మిస్టరీగా మారింది. సెప్టెంబర్‌ 24వ తేదీన అథెన్‌కోడ్‌కు చెందిన ఓ స్కూల్‌ విద్యార్థి.. మరో విద్యార్థి ఇచ్చిన డ్రింక్‌ తాగి ఆస్పత్రి పాలయ్యాడు. ఆ డ్రింకులోనూ యాసిడ్‌ తరహా ఆనవాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మూడు వారాలపాటు చికిత్స పొందిన 11 ఏళ్ల ఆ బాలుడు.. చివరికి ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌తోనే కన్నుమూశాడు. సుచింద్రమ్‌ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేపట్టగా.. షరోన్‌ రాజ్‌ మృతి కూడా అదే తరహాలో చోటు చేసుకోవడం గమనార్హం. 

మరిన్ని వార్తలు