వీడియో: ప్రాంక్‌ పేరిట వెకిలి చేష్టలు, బైక్‌పై స్నానం చేస్తూ.. సరదా తీర్చిన పోలీసులు

5 Nov, 2022 17:36 IST|Sakshi

నలుగురికి ఇబ్బంది కలిగించకుండా.. నవ్వించేదే ప్రాంక్‌ అంటే. అలాంటిది.. ప్రాంక్‌ పేరుతో పిచ్చి పిచ్చి చేష్టలకు పాల్పడే వాళ్లనే ఎక్కువగా ఇప్పుడు చూస్తున్నాం. అభ్యంతకరంగా ఉండే కంటెంట్‌తోనూ పాపులారిటీని సంపాదించుకుంటున్నారు కొందరు. ఈ క్రమంలో వాళ్లను అనుసరించే వాళ్ల సంఖ్య సైతం పెరిగిపోతోంది. 

తాజాగా కేరళలో ప్రాంక్‌ పేరిట ఇద్దరు యువకులు వెకిలి చేష్టలకు పాల్పడ్డారు. బైక్‌ మీద వెళ్తునే.. జోరువానలో అర్థనగ్నంగా స్నానం చేశారు. పైగా స్నానానికి సోప్‌ను సైతం ఉపయోగించారు. సిగ్నల్స్‌ దగ్గర కూడా వాళ్ల వెకిలి చేష్టలు కొనసాగాయి. అయితే.. ఈ వీడియో కాస్త వైరల్‌ కావడంతో పోలీసులు స్పందించారు. 

యువకులను భరణిక్కవుకు చెందిన అజ్మల్‌, బాదుషాలుగా గుర్తించి.. కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. ట్రాఫిక్‌ చట్టాలను ఉల్లంఘించిన నేరానికి కేసు నమోదు చేసి.. ఐదువేల రూపాయల జరిమానా విధించారు. తాము నవంబర్‌ 1న సాయంత్రం ఓ స్పోర్ట్స్‌ ఈవెంట్‌కు హాజరై వస్తున్నామని, వాన కురుస్తుండడంతో సరదా కోసం అలా ప్రాంక్‌ వీడియో చేశామని ఇద్దరు యువకులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు