పోలీసులకు షాక్‌.. అసెంబ్లీ గేటుకు ఖలిస్తాన్‌ జెండాలు.. సీఎం ఫైర్‌

8 May, 2022 12:37 IST|Sakshi

సిమ్లా: వేర్పాటువాద ఖలిస్తాన్‌ జెండాలు హిమాచల్‌ప్రదేశ్‌లో కలకలం రేపాయి. ఏకంగా అసెంబ్లీ ప్రధాన గేటు, గోడపై ఖలిస్తాన్‌ జెండాలు దర్శనమిచ్చాయి. దీంతో పోలీసులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. 

వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని ధర్మశాలలో ఆదివారం ఉదయం అసెంబ్లీ ప్రధాన గేటు, గోడలపై ఖలిస్తాన్‌ జెండాలు ప్రత‍్యక్షమయ్యాయి. ఈ సందర్భంగా కాంగ్రా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. శనివారం అర్ధరాత్రి గానీ లేక ఆదివారం ఉదయం గానీ ఈ జెండాలను పాతినట్టు తెలిపారు. ఆదివారం ఉదయం జెండా చూసిన వెంటనే తొలగించామన్నారు. అయితే, ఈ జెండాలను పంజాబ్‌ నుంచి వచ్చిన ఉగ్రవాదులేనని పెట్టి ఉండవచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొన్నారు. 

ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టినట్టు స్పష్టం చేశారు. ఈ ఘటనపై హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం జైరామ్‌ ఠాకూర్‌ సీరియస్‌ అయ్యారు. జెండా పాతిన వారికి ధైర్యం ఉంటే రాత్రి కాదు.. పగలు వచ్చి జెండా పెట్టండి అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి కారకాలను కఠినంగా శిక్షిస్తామని అన్నారు. 

మరిన్ని వార్తలు