కాంగ్రెస్‌ సీడబ్ల్యూసీ కనుమరుగు.. 47 మందితో ఇక స్టీరింగ్‌ కమిటీ

26 Oct, 2022 19:25 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా బుధవారం బాధ్యతలు చేపట్టారు సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే. తొలి రోజే తన మార్క్‌ను చూపించేలా నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో అంతర్గత మార్పులకు నాంది పలుకుతూ.. సీడబ‍్ల్యూసీ స్థానంలో స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, మన్మోహన్‌ సింగ్‌ సహా మొత్తం 47 మందితో స్టీరింగ్‌ కమిటీని నియమించారు. పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) స్థానంలో ఈ స్టీరింగ్‌ కమిటీ పని చేయనుంది. 

బుధవారం ఉదయమే కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యులు రాజీనామా చేశారు. ‘సీడబ్ల్యూసీ సభ్యులు, ఏఐసీసీ జనరల్‌ సెక్రెటరీలు, ఇంఛార్జులు తమ రాజీనామాలను కాంగ్రెస్‌ అధ్యక్షుడికి అందించారు.’ అని తెలిపారు ఏఐసీసీ జనరల్‌ సెక్రెటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్‌. ప్లీనరీ సెషన్‌ నిర్వహించే వరకు స్టీరింగ్‌ కమిటీ కొనసాగనుందని, తదుపరి ఏఐసీసీ(ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ) సెషన్‌లో వర్కింగ్‌ కమిటీ కొత్త సభ్యులను ఎన్నుకోనున్నారని సమాచారం.

ఇదీ చదవండి: కాంగ్రెస్ కొత్త సారథిగా ఖర్గే.. అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన సోనియా..

మరిన్ని వార్తలు