ఖర్గే వర్సెస్‌ థరూర్‌

17 Oct, 2022 04:31 IST|Sakshi

నేడే కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నిక

కాంగ్రెస్‌ చరిత్రలో ఆరోసారి ఎన్నిక

పాతికేళ్ల తర్వాత పార్టీకి గాంధీయేతర అధ్యక్షుడు

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికకు సర్వం సిద్ధమైంది. సీనియర్‌ నాయకులు మల్లికార్జున ఖర్గే, శశి థరూర్‌ల మధ్య పోటీ నెలకొంది. సోమవారం జరిగే పోలింగ్‌లో కాంగ్రెస్‌ ఎలక్టోరల్‌ కాలేజీలోని 9 వేల మందికి పైగా పీసీసీ ప్రతినిధులు రహస్య ఓటింగ్‌ ద్వారా ఏఐసీసీ కొత్త చీఫ్‌ను ఎన్నుకోనున్నారు. 24 ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి పార్టీ పగ్గాలను చేపట్టనున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంతో పాటు దేశవ్యాప్తంగా 65 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 137 ఏళ్ల కాంగ్రెస్‌ చరిత్రలో అ«ధ్యక్ష పదవికి ఎన్నిక జరగడం ఇది ఆరోసారి మాత్రమే.

ఖర్గే ఎన్నిక లాంఛనమే!
కాంగ్రెస్‌ అధిష్టానం అధికారికంగా ఎవరికీ మద్దతివ్వకున్నా గాంధీ కుటుంబం అండదండలతో ఖర్గే బరిలో దిగారు. జీ 23 అసమ్మతి నాయకులతో పాటు ఇతర సీనియర్లూ మద్దతు ప్రకటించడంతో ఆయన గెలుపు లాంఛనంగా కన్పిస్తోంది. అయితే పార్టీలో బ్లాక్‌ అధ్యక్షుడి నుంచి స్వయంకృషితో ఎదిగిన దళిత నాయకుడైన మల్లికార్జున ఖర్గే (80), అపారమైన మేధస్సుతో ఐక్యరాజ్య సమితిలో పని చేసిన అనుభవంతో కొత్త ఆలోచనలు చేసే నాయర్‌ కమ్యూనిటీకి చెందిన శశిథరూర్‌ ( 66) మధ్య రసవత్తర పోటీ సాగుతుందని కొందరు యువ నాయకుల అంచనా.

కాంగ్రెస్‌ పార్టీ చరిత్రలోనే అత్యంత సంక్లిష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న ఈ తరుణంలో అనుభవానికి ప్రాధాన్యతనివ్వాలని సంస్థాగతంగా పార్టీ గురించి ప్రతీ అంశం తెలిసిన వారినే గెలిపించాలని ఖర్గే ప్రచారం చేశారు. పార్టీలో మార్పు కోరుకునే వారు, వికేంద్రీకరణకు మద్దతునిచ్చేవారు తనను బలపరచాలంటూ థరూర్‌ విజ్ఞప్తి చేశారు. పీసీసీ ప్రతినిధుల్ని కలుసుకున్న సమయంలో ఖర్గేకి అండగా సీనియర్‌ నాయకులు నిలబడితే, యువ నాయకులందరూ థరూర్‌కి స్వాగతం పలికిన దృశ్యాలు కనిపించాయి. ఇరువురు నేతలూ తాము గాంధీ కుటుంబానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామనే స్పష్టం చేస్తూ వచ్చారు.

గాం«ధీ కుటుంబానికి వీర విధేయుడైన ఖర్గే వారిచ్చే సూచనలు, సలహాలు తాను తప్పక పాటిస్తానని చెబితే గాంధీ కుటుంబ సభుల్ని దూరంగా ఉంచి పార్టీ అధ్యక్షులెవరూ పని చేయలేరని పార్టీ రక్తంలో వారి డీఎన్‌ఏ ఉందని థరూర్‌ వ్యాఖ్యానించడం విశేషం. అనారోగ్య కారణాలతో సోనియాగాంధీ, అధ్యక్ష పదవిపై ఆసక్తి లేక రాహుల్‌గాంధీ పోటీకి దిగడానికి నిరాకరించడంతో ఈ సారి ఎన్నికలు అనివార్యమయ్యాయి. సోనియా, ప్రియాంక గాంధీ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో, భారత్‌ జోడో యాత్రలో ఉన్న రాహుల్‌ బళ్లారిలోని ఓటేయనున్నారు.  

మరిన్ని వార్తలు