రికార్డు స్థాయిలో ఖరీఫ్‌ సాగు

5 Sep, 2020 03:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం సకాలంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ యంత్రాలు మరియు రుణాలను అందించడం వల్ల కోవిడ్‌–19 లాక్‌డౌన్‌ సమయంలో కూడా రికార్డు స్థాయిలో సాగు సాధ్యమైందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖా మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ పేర్కొన్నారు. సమృద్ధిగా వర్షాలు కురవడం, ప్రభుత్వం ప్రధాన పథకాలను సకాలంలో అమలు పరచడం, రైతులు కూడా సకాలంలో వ్యవసాయ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా  ఇది సాధ్యపడిందని తెలిపారు. ఖరీఫ్‌ సీజను గణాంకాల వివరాలు నమోదు కు అక్టోబరు 2, 2020 చివరి తేదీ కాగా.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1095.38 లక్షల హెక్టార్లలో ఖరీఫ్‌ సాగైనట్టు వెల్లడించారు.

► వరి పంట గత సంవత్సరం 365.92 లక్షల హె క్టార్లలో సాగు కాగా ఈ ఏడాది 396.18 లక్షల హెక్టార్లలో సాగయ్యింది. గత ఏడాది ఇదే సీజనుతో పోలిస్తే 8.27% సాగు విస్తీర్ణం పెరిగింది.

► కాయ ధాన్యాలు ఈ సంవత్సరం ఖరీఫ్‌ సీజన్లో సాగు 136.79 లక్షల హెక్టార్లుగా ఉండగా గత సంవత్సరం 130.68 లక్షల హెక్టార్లుగా ఉంది. 4.67% మేర సాగు విస్తీర్ణం పెరిగింది.

► తృణధాన్యాలు గత సంవత్సరం ఖరీఫ్‌లో 176.25 లక్షల హెక్టార్లు సాగు విస్తీర్ణం ఉండగా, ఈ సంవత్సరం 179.36 లక్షల హెక్టార్లు సాగు లో ఉంది. 1.77% సాగు విస్తీర్ణం పెరిగింది.

► నూనె గింజలు ఈ సంవత్సరం ఖరీఫ్‌ సీజన్లో 194.75 లక్షల హెక్టార్లలో సాగవ్వగా గత సంవత్సరం 174.00 లక్షల హెక్టార్లలో సాగైంది. అంటే  11.93% సాగు విస్తీర్ణం పెరిగింది.

► చెరుకు గత సంవత్సరం 51.71 లక్షల హెక్టార్లలో సాగుచేయగా ఈ సంవత్సరం ఖరీఫ్‌లో 52.38 లక్షల హెక్టార్లలో సాగు అవుతోంది. 1.30% సాగు విస్తీర్ణంలో పెరుగుదల నమోదయ్యింది.

► పత్తి గత సంవత్సరం 124.90 లక్షల హెక్టార్లుగా ఉండగా ఈ ఖరీఫ్‌లో 128.95 లక్షల హెక్టార్లలో సాగు నమోదయ్యింది.గత సంవత్సరంతో పోలిస్తే 3.24% సాగు విస్తీర్ణం పెరిగింది.

► జనపనార ఈ ఏడాది 6.97 లక్షల హెక్టార్లు కాగా... గత సంవత్సరం 6.86 లక్షల హెక్టార్లలో సాగయ్యింది. 1.68% పెరిగిన సాగు విస్తీర్ణం.
కలిసి వచ్చిన వర్షపాతం

► ఈ ఏడాది సెప్టెంబరు 3 నాటికి దేశంలో సాధారణ వర్షపాతం 730.8 మి.మి. కాగా ఈ సంవత్సరం 795.0 మి.మి. వర్షపాతం నమోదైంది. 9% ఎక్కువ వర్షపాతం నమోదైంది.

మరిన్ని వార్తలు