మోదీజీ... కరోనాపై పోరాటంలో మా చదువుల్ని త్యాగం చేస్తాం

5 Jun, 2021 15:13 IST|Sakshi

దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ తీవ్రత కారణంగా పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. ఇక మహమ్మారి కట్టడి చర్యల్లో భాగంగా అనేక విద్యాసంస్థలు మూతపడ్డాయి. విద్యార్థులకు చదువులు ఆటంకం ఏర్పడకూడదని చాలా పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ విద్యాభ్యాసం కొనసాగించే వెసలుబాటు లేని కొందరి విద్యార్థుల కష్టాలు మనల్ని కదిలించేలా ఉండగా, మరికొందరి పిల్లలు వారి పరిస్థితులను తెలుపుతున్న వీడియోలు ఫన్నీగా ఉంటున్నాయి. ఈ క్రమంలో ఇద్దరు పిల్లలు మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి హల్‌చల్‌ చేస్తోంది. ఆ వీడియోలో వారు ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు వారి అమాయకత్వం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

19 సెకన్ల వైరల్ క్లిప్‌లో,  ఆ ఇద్దరు పిల్లలు.. “ మోదీ జీ కరోనాతో పోరాడటం కోసం మా చదువులను త్యాగం చేయవలసి వస్తే అందుకు మేము సిద్ధంగా ఉన్నాము. ఏడేళ్లపాటు పాఠశాలలు మూసివేయాల్సి వస్తే, మేము ఆ త్యాగానికి సిద్ధంగా ఉంటాం” అని తెలిపారు. ఈ తరహా వీడియోనే ఇటీవల జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఓ ఆరేళ్ల బాలిక మాత్రం ఇందుకు భిన్నంగా ఆన్‌లైన్‌ చదువులపై తనకున్న అసహనాన్ని గట్టిగానే వెల్లగక్కింది. తన బాధను దేశ ప్రధాని నరేంద్ర మోదీతో మొరపెట్టుకున్న సంగతి తెలిసిందే.

చదవండి: వరదలో చిక్కిన మహిళ.. సహాయక సిబ్బంది తెగువతో

మరిన్ని వార్తలు