హాట్‌ టాపిక్‌గా పుదుచ్చేరి పరిణామాలు

17 Feb, 2021 13:05 IST|Sakshi

పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను తొలగిస్తూ రాష్ట్రపతి భవన్‌ ప్రకటన

తెలంగాణ గవర్నర్‌కు అదనంగా పుదుచ్చేరి బాధ్యతలు

మైనారిటీలో నారాయణ స్వామి ప్రభుత్వం 

సాక్షి చెన్నై/న్యూఢిల్లీ: పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కీలక పరిణామాలు సంభవించాయి. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీని కేంద్రం పదవి నుంచి తొలగించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి రాష్ట్రపతి భవన్‌ నుంచి ఒక ప్రకటన వెలువడింది. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై.. పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను నిర్వహిస్తారని తెలిపింది.  మరొకరిని నియమించే వరకు ఆ బాధ్యతలు తమిళిసై నిర్వర్తిస్తారు. సీఎం నారాయణ స్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిన కొద్ది గంటల్లోనే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. మేలో జరగనున్న ఎన్నికల్లో కిరణ్‌ బేడీపై వ్యతిరేకతను ప్రతిపక్షాలు ప్రధాన ప్రచారాంశంగా మలుచుకోరాదనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత నెలలో కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరైన ఎ.నమశ్శివాయం ప్రధాన డిమాండ్లలో కిరణ్‌ బేడీ తొలగింపు ఒకటని సమాచారం. 

నారాయణ స్వామి ఏమంటున్నారు?
మాజీ ఐపీఎస్‌ అధికారి కిరణ్‌బేడీ 2016 మేలో పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. అప్పటి నుంచి నారాయణ స్వామి ప్రభుత్వంతో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆమె పనితీరు అప్రజాస్వామికంగా ఉందంటూ నారాయణ స్వామి ఆరోపిస్తున్నారు. 2019లో, తిరిగి గత నెలలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అధికార నివాసం ఎదుట నారాయణ స్వామి ధర్నాకు కూడా దిగారు.

సీఎం నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ..‘మా ఎమ్మెల్యే మల్లాడి నారాయణ స్వామిని కిరణ్‌ బేడీ పలుమార్లు వేధింపులకు గురి చేశారు. దీనిపై రాష్ట్రపతి కోవింద్‌కు కూడా ఫిర్యాదు చేశాం. రోజువారీ పరిపాలనా వ్యవహారాల్లోనూ కిరణ్‌ బేడీ జోక్యం చేసుకుంటున్నారు. సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు’అని చెప్పారు. తన ప్రభుత్వానికి ఇప్పటికీ మెజారిటీ ఉందని సీఎం నారాయణ స్వామి ఎన్‌డీటీవీతో అన్నారు. కృష్ణారావు, కుమార్‌ల రాజీనామాలను ఆమోదించలేదనీ, అవి ఇంకా స్పీకర్‌ పరిశీలనలోనే ఉన్నాయన్నారు.

నేడు రాహుల్‌ రాక
బలం కోల్పోవడంతో ప్రభుత్వాన్ని రద్దు చేయాలని సీఎం నారాయణస్వామి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో మొత్తం 30 స్థానాలకు గాను 2016 ఎన్నికల్లో 15 సీట్లు గెలుపొందిన కాంగ్రెస్‌ అధికారం చేపట్టింది. ముగ్గురు డీఎంకే ఎమ్మెల్యేలు, ఒక ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే మిత్రపక్షాలుగా ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్ప డుతున్నారనే ఆరోపణలపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ధనవేలును ఆ పదవి నుంచి పార్టీ తొలగించింది. ఇటీవల మంత్రి నమశ్శివాయం, ఎమ్మెల్యే దీపా యన్దన్‌ సైతం రాజీనామా చేశారు. కొన్ని రోజుల క్రితం మంత్రి పదవికి రాజీనామా చేసిన మల్లాడి కృష్ణారావు ఈనెల 15న ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశారు.

మరో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జాన్‌కుమార్‌ మంగళవారం తన రాజీనామా పత్రాన్ని స్పీకర్‌కు అందజేశారు. స్పీకర్‌ను కలుపుకుని అసెంబ్లీలో కాంగ్రెస్‌ బలం 10కి పడింది. మూడు డీఎంకే, ఒక స్వతంత్ర అభ్యర్థులను కలుపుకున్నా 14కి పరిమితం కాగలదు. ప్రతిపక్షంలో ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ 7, అన్నాడీఎంకే 4, నామినేటెడ్‌ (బీజేపీ) ఎమ్మెల్యేలు 3తో కలుపుకుని మొత్తం 14 సభ్యుల బలం ఉంటుంది. అధికార, ప్రతిపక్షాలకు సమబలం ఏర్పడడంతో ప్రభుత్వం మైనార్టీలో పడింది. 

ఒక ఎమ్మెల్యేకు బీజేపీ గాలం వేస్తే మ్యాజిక్‌ ఫిగర్‌ 15 స్థానాలతో అధికారంలోకి రాగలదు.  ప్రభుత్వం మెజార్టీ కోల్పోయిన నేపథ్యంలో పుదుచ్చేరి చేరుకున్న రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్‌ దినేష్‌ గుండూరావుతో నారాయణస్వామి, మంత్రులు, ఎమ్మెల్యేలు సమాలోచనలు జరిపారు. మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్నందున మంత్రివర్గమే రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  

మరిన్ని వార్తలు