షాకింగ్‌ వీడియోను పోస్ట్‌ చేసిన కిరణ్‌ బేడి... మండిపడుతున్న నెటిజన్లు

11 May, 2022 19:00 IST|Sakshi

Shark Jumping Unbelievably High To Grab The Chopper: ప్రముఖులు, సెలబ్రెటీలు వైరల్‌ వీడియోలు పోస్ట్‌ చేసే ముందు చాలా జాగ్రత్త ఉండాలి. లేదంటే నెటిజన్ల ట్రోలింగ్‌కి గురవ్వాల్సిందే. అచ్చం అలానే ఒక సినిమాలో సీన్‌ని వైరల్‌ వీడియో పోస్ట్‌ చేసి నెటజన్ల ఆగ్రహానికి గురయ్యారు మాజీ ఐపీఎస్‌ అధికారిణి కిరణ్‌బేడీ.

అసలేం జరిగిందంటే...ఒక షార్క్‌ చేప సముద్రంలోంచి పైకి ఎగిరి హెలికాప్టర్‌ పై దాడి చేస్తున్న వైరల్‌ వీడియోని మాజీ ఐపీఎస్‌ అధికారిణి, పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. పైగా ఈ వీడియోకి నేషనల్ జియోగ్రాఫిక్ ఒక మిలియన్ డాలర్లు చెల్లించిందని కూడా ట్వీట్‌ చేశారు. నిజానికి ఇది 2017లో వచ్చిన ఫైవ్‌ హెడ్డ్‌ షార్క్‌ ఎటాడ్‌ చిత్రంలోని సన్నివేశం. దీంతో నెటిజన్లు ఈ వీడియోని చూసి ఒక్కసారిగా షాక్‌కి గురై ఆమెను దారుణంగా ట్రోల్‌ చేయడవ మొదలుపెట్టారు.

అంతేకాదు అత్యంత మేధావులైన ఐఏఎస్‌ లేదా ఐపీఎస్‌ అధికారులు ఇలాంటి ఫేక్‌ వీడియోని పోస్ట్‌ చేయడం ఏంటని ఒకరు, అయినా అసలు అదేలా సాధ్యం అని కూడా ఆలోచించకుండా ఈ వీడియోని పోస్ట్‌ చేశారంటు మరోకరు ఇలా రకరకాలుగా కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. దీంతో కిరణ్‌ బేడి స్పందించడమే కాకుండా మళ్లీ ఆ వీడియోని పోస్ట్‌ చేస్తూ పూర్తి వివరణ ఇచ్చారు.

ఈ సన్నివేశం ఎక్కడ నుంచి వచ్చింది అనేదానికంటే అసలు అలా చేయాలనే ఊహ రావడం గ్రేట్‌ అని అన్నారు. అయినా ఇలాంటి సాహసోపేతమైన సన్నివేశాన్ని తీయాలనే ఆలోచన తట్టినందుకు మనం ప్రశంసించాలి అంటూ ట్విట్టర్‌లో చెప్పుకొచ్చారు. ఐతే ఆమె గతంలో కూడా ఇలాంటి ఫేక్‌ వీడియోలు పోస్ట్‌ చేసి నెటిజన్ల ట్రోలింగ్‌కి గురయ్యారు.

(చదవండి: వైరల్‌ వీడియో: సింహాన్ని తరిమిన శునకం)

మరిన్ని వార్తలు