గల్వాన్‌ ఘటన: ఈ కుర్ర జవాన్‌ ఎవరో తెలుసా!

22 Feb, 2021 11:33 IST|Sakshi

ఇంఫాల్‌: పదో విడత కోర్‌ కమాండర్‌ స్థాయి సమావేశాలకు ముందు చైనా శనివారం కొన్ని వీడియోలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్‌లో జరిగిన గల్వాన్‌ ఘటనకు సంబంధించిన వీడియోలను షేర్‌ చేస్తూ భారత దళాలు తమ భూభాగంలోకి వచ్చాయని చైనా ఆరోపించింది. అయితే ఈ వీడియోల్లో ఆవేశంతో చైనా దళాలను హెచ్చరిస్తూ ఓ కుర్ర జవాను భారత సైన్యాన్ని నడిపించినట్లు కనిపించాడు. దీంతో అందరి దృష్టి ఆ కుర్రాడిపై పడింది. ఇంతకీ అతడు ఎవరా అని తెలుసుకునేందుకు అందరూ ఉత్సుకతతో ఉన్నారు. అయితే చైనా ఈ వీడియోలను విడుదల చేసిన తర్వాత కూడా భారత్‌ అతడి వివరాలను వెల్లడించడంలో గొప్యత పాటించింది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర యువజన వ్యవహరాల శాఖ మంత్రి కిరణ్‌ రిజీజు ఈ కుర్ర ఆఫీసర్‌‌ ఎవరన్నది ట్విటర్‌ వేదికగా స్పష్టం చేశారు. 

‘ఇతడు మణిపూర్‌ సేనాపతి జిల్లాకు చెందిన కెప్టెన్‌ సోయిబా మనినగ్భా రంగ్నామి. 2018లో సైన్యంలో చేరిన ఈ కుర్ర ఆఫీసరు ప్రస్తుతం 18వ బిహార్‌ రెజిమెంట్‌లో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నట్టు’ ఆయన పేర్కొన్నారు. అలాగే మణిపూర్‌ ముఖ్యమంత్రి బిరేన్‌ సింగ్‌ సైతం ట్వీట్‌ చేసి కెప్టెన్‌ రంగ్నామీపై ప్రశంసలు కురిపించారు. ‘మీట్‌ మణిపూర్‌ సేనాపతి జిల్లాకు చెందిన కెప్టెన్‌ సోయిబా. ఇతడు గల్వాన్‌ లోయ వద్ద చైనాకు వ్యతిరేకంగా జరిగిన ఘర్షణలో భారత దళాన్ని నడిపించాడు. దేశం కోసం నిలబడి అతడు చూపించిన శౌర్యం మనందరినీ గర్వించేలా చేసింది’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. కాగా అతడిని ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘మెన్షన్‌ ఆఫ్‌ డిస్పాచెస్‌’ గౌరవాన్ని ఇచ్చి భారత ప్రభుత్వం సత్కరించింది.

చదవండి: గల్వాన్‌ ఘర్షణ: వీడియో విడుదల చేసిన చైనా             
గల్వాన్‌ ఘటన: తొలిసారి వివరాలు వెల్లడించిన చైనా
 ఎట్టకేలకు దిగొచ్చిన చైనా

మరిన్ని వార్తలు