26న రైతుల జాతీయ సదస్సు

17 Aug, 2021 04:42 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభమై 9 నెలలు పూర్తవుతున్న సందర్భంగా ఆగస్టు 26న జాతీయ స్థాయిలో సదస్సు నిర్వహించనున్నట్లు సంయుక్త కిసాన్‌ మోర్చా సోమవారం ప్రకటించింది. ఇందులో స్థానిక, ప్రాంతీయ, జాతీయ స్థాయిల నుంచి వందలాది రైతు సంస్థలు పాల్గొంటాయని పేర్కొంది. ఈ సదస్సుకు సంబంధించిన వేదిక వివరాలను త్వరలో చెబుతామని రైతు సంఘాల నేత ఒకరు చెప్పారు. సాగు చట్టాలను వెనక్కు తీసుకోవాలంటూ రైతులు చేస్తున్న నిరసనలు కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. పరిష్కారం కోసం ప్రభుత్వం, రైతు నాయకుల మధ్య 10 రౌండ్ల చర్చలు జరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. నర్మదా బచావో ఆందోళన్‌ జరిగి 36 ఏళ్లు పూర్తవుతున్నసందర్భంగా ఆగస్టు 17న నర్మదా కిసాన్‌ మజ్దూర్‌ జన్‌ సంసద్‌ జరగనుంది. ఈ సమావేశానికి మధ్యప్రదేశ్, గుజరాత్‌ రైతులు హాజరయ్యే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు