బీజేపీ యూత్‌ లీడర్‌ హల్‌చల్‌.. లాయర్‌ కాలర్‌ పట్టుకుని దాడి

28 Aug, 2022 09:48 IST|Sakshi

బీజేపీ యూత్‌ లీడర్‌ హల్‌చల్‌ చేశాడు. ఓ లాయర్‌పై విచక్షణారహితంగా.. అతడి కాలర్‌ పట్టుకుని దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆధారంగా పోలీసులు.. బీజేపీ నేతపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. 

వివరాల ప్రకారం.. బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని ఐసీసీఆర్‌ ఆడిటోరియంలో బీజేపీ ఓ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ హాజరయ్యారు. ఇక, బీజేపీ మీటింగ్‌ కావడంతో సమావేశంలో పాల్గొనేందుకు స్థానిక నేతలతో పాటుగా ఉత్తర కోల్‌కతాకు చెందిన బీజేపీ యూత్‌ వింగ్‌ లీడర్‌ అభిజిత్‌ కూడా అక్కడికి వచ్చాడు. కాగా, కాసేపట్లో సమావేశం ముగుస్తుందనగా అభిజిత్‌ హల్‌చల్‌ చేశాడు. 

ఇక,ఈ సమావేశంలో పాల్గొన్న బీజేపీ నేత సమిక్‌ భట్టాచార్యను కలిసేందుకు సబ్యసాచి రాయ్‌ చౌదురి అక్కడికి వచ్చాడు. ఈ క్రమంలో సబ్యసాచి రాయ్‌ చౌదురిని చూసిన అభిజిత్‌.. ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయాడు. సబ్యసాచి రాయ్‌.. టీఎంసీ నాయకుడని, ఐపీఎస్‌ అధికారుల పేర్లు చెప్పి చాలా మంది వద్ద డబ్బులు వసూలు చేశాడని ఆరోపిస్తూ.. అతడి కాలర్‌ పట్టుకుని చితకబాదాడు. గట్టిగా అరుస్తూ విచక్షణారహితంగా కొట్టాడు. ఈ సందర్భంగా చౌదురి.. తాను ఓ లాయర్‌నని, టీఎంసీ కార్యకర్తను కాదని చెబుతున్నా.. అభిజిత్‌ పట్టించుకోలేదు. చివరకు.. తనను కలిసేందుకే చౌదురి ఇక్కడకు వచ్చారని.. సమిక్‌ భట్టాచార్య నిర్ధారించడంతో శాంతించాడు. కాగా, ఈ దాడిపై చౌదురి పోలీసులకు ఆశ్రయించగా..  ఆడిటోరియం వద్ద వీడియో​ ఆధారంగా కేసు నమోదు చేసినట్టు తెలిపారు. 

మరిన్ని వార్తలు