వివాదాస్పద వ్యాఖ్యలు.. నుపుర్‌ శర్మకు సమన్ల వెల్లువ

14 Jun, 2022 08:14 IST|Sakshi

థానె: ఓ టీవీ చర్చా కార్యక్రమంలో మొహమ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సస్పెండైన బీజేపీ నాయకురాలు నుపుర్‌ శర్మకు సమన్లు వెల్లువెత్తుతున్నాయి. పలు రాష్ట్రాల పోలీసులు ఆమెకు ఇప్పటికే నోటీసులు పంపిన విషయం తెలిసిందే. తాజాగా కోల్‌కతా పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ నెల 20వ తేదీన నర్కెల్‌దంగా పోలీస్‌స్టేషన్‌లో హాజరు కావాలని కోరారు. టీఎంసీ మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌ సొహైల్‌ ఫిర్యాదు మేరకు నోటీసులిచ్చారు.

నుపుర్‌ శర్మ అభ్యర్థన మేరకు ఆమె హాజరు కావాల్సిన గడువును మరికొద్ది రోజులు పొడిగించినట్లు మహారాష్ట్రలోని థానె జిల్లా భివాండి పోలీసులు తెలిపారు. ఈనెల 22వ తేదీన హాజరై వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా నుపుర్‌ శర్మకు నోటీసులు ఇచ్చినట్లు థానెలోని ముంబ్రా పోలీసులు, 25న హాజరు కావాలంటూ ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు.  

బెంగాల్‌లో ఇంకా ఉద్రిక్తతే
బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైలు మార్గాలపై నుపుర్‌ దిష్టిబొమ్మలను దహనం చేసి, బైఠాయించడంతో సియల్డా–హష్నాబాద్‌ మార్గంలో సోమవారం ఉదయం 20 నిమిషాలపాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని ఈస్టర్న్‌ రైల్వే తెలిపింది. ముర్షిదాబాద్, నడియా జిల్లాలతోపాటు హౌరాలోని కొన్ని ప్రాంతాల్లో 144వ సెక్షన్‌ అమలవుతోంది.

యూపీలో 325 మంది అరెస్ట్‌
శుక్రవారం నాటి అల్లర్లకు సంబంధించి యూపీలోని 8 జిల్లాలకు చెందిన 325 మందిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. అల్ల్లర్లకు సూత్రధారి జావెద్‌ అహ్మద్‌ అక్రమంగా నిర్మించుకున్న ఇంటిని అధికారులు కూల్చివేయడాన్ని సవాల్‌ చేస్తూ కొందరు అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఇది అన్యాయం, అక్రమమని బీఎస్‌పీ అధినేత్రి మాయావతి కూడా ఆరోపించారు.

మరిన్ని వార్తలు