బికినీలో ‘మేడమ్‌‌’ హల్‌చల్‌.. కంగుతిన్న పేరెంట్స్‌!.. పరిహారం కోరుతున్న కోల్‌కతా యూనివర్సిటీ

9 Aug, 2022 18:47 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఓ​ యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోల కారణంగా ఆమె ఉద్యోగం ఊడింది. అందుకు కారణం.. ఆ ఫొటోలు అభ్యంతకరంగా ఉన్నాయని పేరెంట్స్‌ ఫిర్యాదు చేయడమే!. ఏడాది కాలంగా నడుస్తోంది ఈ కేసు..

కోల్‌కతాకు చెందిన ఓ ప్రముఖ కాలేజీలో సదరు అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌ పని చేస్తోంది. అయితే ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో తరచూ ఫొటోలు అప్‌లోడ్‌ చేస్తూ వెళ్తోంది. ఈ క్రమంలో ఓరోజు ఫ్లస్‌ టూ చదువుతున్న ఓ విద్యార్థి(18) ఆమె ఫొటోలను పదే పదే చూస్తూ ఉండిపోయాడట. అది రహస్యంగా గమనించిన అతని తండ్రి బీకే ముఖర్జీ.. కాలేజీ యాజమాన్యానికి ఓ లేఖ రాశాడు. 

సదరు మేడమ్‌గారు అలాంటి ఫొటోలు అప్‌లోడ్‌ చేయడం సిగ్గుచేటని.. ఆమె వల్ల తమ పిల్లలు పాడైపోతున్నారని, ఆమె బికినీలో ఫొటోలు అప్‌లోడ్‌ చేయడం విద్యార్థులను రెచ్చగొట్టడమే అవుతుందని.. ఆమెపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నాడు. అంతేకాదు ఆమె ఫొటోలను సైతం ఎటాచ్‌ చేసి మరీ పంపించాడట. ఈ నేపథ్యంలో.. కిందటి ఏడాది అక్టోబర్‌లో మీటింగ్‌ పెట్టి మరీ ఆమెను తొలగించక తప్పలేదు కాలేజీ యాజమాన్యానికి. అయితే ఆమె తన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసిందని.. అభ్యంతరకర ఫొటోల విషయంలో కాదని కాలేజీ యాజమాన్యం ఓ స్టేట్‌మెంట్‌ రిలీజ్‌ చేసింది. అయితే ఆ మరుసటిరోజే ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది.

ఇదిలా ఉంటే.. తన ఫోన్‌ను, సోషల్‌ మీడియా అకౌంట్లను హ్యాక్‌ చేసి ఎవరో.. వ్యక్తిగత ఫొటోలను అప్‌లోడ్‌ చేస్తున్నారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన క్యారెక్టర్‌ను దిగజార్చే క్రమంలోనే ఇదంతా జరుగుతోందని, ఇది ముమ్మాటికీ కాలేజీ యాజమాన్యం తనపై చేస్తున్న వేధింపుల కిందకే వస్తుందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

ఈలోపు తనకు సదరు విద్యార్థి తండ్రి చేసిన ఫిర్యాదు కాపీ ఇవ్వాలంటూ యూనివర్సిటీకి సదరు ప్రొఫెసర్‌ లీగల్‌ నోటీసులు పంపింది. ఆ నోటీసులు ఈ ఏడాది మార్చ్‌ 28న యూనివర్సిటీ స్పందించింది. లీగల్‌ నోటీసులను దురద్దేశ పూర్వకంగా పంపారని, ఇది కాలేజీ ప్రతిష్టను దెబ్బ తీయడమే అవుతుందని బదులు ఇచ్చింది. అంతేకాదు భేషరతు క్షమాపణలు చెప్పాలని,  నష్టపరిహారం కింద 99 కోట్ల రూపాయలు చెల్లించాలని సదరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు బదులు ఇచ్చింది యూనివర్సిటీ. దీంతో ప్రస్తుతం ఆమె హైకోర్టుకు వెళ్లనున్నారు. 

ఇదీ చదవండి: హాయ్‌.. నేను కలెక్టర్‌ టీనా దాబిని!

మరిన్ని వార్తలు