ఫోన్‌లోనే శరీరంలోని ఆక్సిజన్‌ స్థాయి తెలుసుకోండిలా!

23 May, 2021 19:02 IST|Sakshi

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కరోనా మహమ్మరి మన దేశాన్ని వణీకిస్తుంది. ఫస్ట్‌ వేవ్‌తో పోలిస్తే మరణాల రేటు అధికంగా ఉంది. దీనికి ప్రధాన కారణం శరీరంలో ఆక్సిజన్‌ లెవెల్స్ పడిపోవడమే. అందుకే మన శరీరంలోని ఆక్సిజన్‌ స్థాయిలు తెలిపే పల్స్‌ ఆక్సీమీటర్లు, స్మార్ట్‌ వాచ్‌లకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగిపోయింది. దీంతో అమాంతంగా వాటి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ఇబ్బందులేవీ లేకుండా ఉచితంగా మన దగ్గర ఉన్న ఫోన్‌లోని ఒక యాప్‌ ద్వారా శరీరంలోని ఆక్సిజన్‌ స్థాయి, పల్స్‌, శ్వాసక్రియల రేట్లు తెలిసేలా ఉంటే బావుంటుంది కదా!? అనే ఆలోచన నుంచి వచ్చిందే ‘కేర్‌ప్లిక్స్‌ వైటల్స్‌ యాప్‌’. 

ఎలా పనిచేస్తుంది?
మన దేశంలోని కోల్‌కతాకు చెందిన ‘కేర్‌ నౌ హెల్త్‌కేర్‌’ అనే స్టార్టప్ సంస్థ ఈ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ 'కేర్‌ప్లిక్స్ వైటల్స్'ను అభివృద్ధి చేసింది. ఇక్కడ చేయాల్సిందల్లా ఈ యాప్ ఓపెన్ చేసి స్మార్ట్‌ఫోన్ వెనుక కెమెరా ఉన్న ఫ్లాష్‌లైట్‌ ఆన్ చేసి దాని మీద వేలు పెట్టిన తర్వాత స్కాన్‌ అనే బటన్‌ను నొక్కగానే నలభై సెకన్లలో ఆక్సిజన్ స్థాయి(SpO2), పల్స్, శ్వాసక్రియ రేట్లను చూపిస్తుంది. ఫోటో ప్లెథిస్మోగ్రఫీ టెక్నాలజీ, కృత్రిమ మేధ సాయంతో కేర్‌ప్లిక్స్‌ వైటల్స్‌ యాప్‌ పనిచేస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే దీనిపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించినట్లు కేర్‌నౌ హెల్త్‌కేర్‌ సహవ్యవస్థాపకుడు శుభబ్రాతా పాల్‌ తెలిపారు. ట్రయిల్స్ లో ఈ యాప్‌ 96 శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ యాప్‌ ప్రస్తుతం ఐవోఎస్‌ వినియోగదారుల కోసం యాప్‌స్టోర్‌లో, ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. టెస్ట్ నిర్వహించడానికి మంచి ఇంటర్నెట్, హై ఎండ్ స్మార్ట్‌ఫోన్ ఉండాలి అప్పుడే కచ్చితమైన ఫలితాలు వస్తాయి. ప్రస్తుతం సింగిల్‌ యూజర్‌ వినియోగం కోసం ఉచితంగా అందిస్తున్నారు. అంతకుమించి సేవలు కావాలంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. మిగతా వివరాలు కేర్‌నౌ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. 

చదవండి:

ఐసీఎంఆర్‌ సీరో సర్వేలో కరోనాపై షాకింగ్ విషయాలు వెల్లడి

మరిన్ని వార్తలు