భీమా–కోరేగావ్‌ కేసులో పవార్‌కు సమన్లు

29 Apr, 2022 05:52 IST|Sakshi

మే 5, 6న హాజరు కావాలని దర్యాప్తు కమిషన్‌ ఆదేశం

ముంబై: 2018 జనవరి 1న చోటుచేసుకున్న భీమా–కోరేగావ్‌ హింసాకాండ కేసులో దర్యాప్తు కమిషన్‌ నేషలిస్టు కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్‌ పవార్‌కు సమన్లు జారీ చేసింది. మే 5, 6న తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఆయన సాక్ష్యాన్ని నమోదు చేస్తామని తెలిపింది. దర్యాప్తు కమిషన్‌కు శరద్‌ పవార్‌ ఏప్రిల్‌ 11న సమర్పించిన అదనపు అఫిడవిట్‌ తాజాగా వెలుగులోకి వచ్చింది. భీమా–కోరేగావ్‌ సంఘటన విషయంలో తనకు ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని అఫిడవిట్‌లో ఆయన పేర్కొన్నారు. ఈ సంఘటన జరగడానికి దారితీసిన పరిస్థితుల గురించి తనకు సమాచారం లేదన్నారు.

భారత శిక్షాస్మృతి(ఐపీసీ)లోని సెక్షన్‌ 124ఏ(దేశద్రోహానికి సంబంధించినది) దుర్వినియోగాన్ని అడ్డుకోవాలని శరద్‌ పవార్‌ కోరారు. ఈ సెక్షన్‌ను పూర్తిగా రద్దు చేయాలని లేదా ఇందులో మార్పులు చేయాలని విన్నవించారు. స్వాతంత్య్ర పోరాటాన్ని అణచివేయడానికి 1870లో బ్రిటిష్‌ పాలకులు తీసుకొచ్చిన సెక్షన్‌ 124ఏను ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. దేశ సమగ్రతను కాపాడానికి చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం సరిపోతుందని సూచించారు. భీమా–కోరేగావ్‌ కేసులో దర్యాప్తు కమిషన్‌ 2020లో శరద్‌ పవార్‌కు సమన్లు జారీ చేసింది. కానీ, అప్పట్లో కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా ఆయన హాజరు కాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ సమన్లు జారీ చేయగా, గైర్హాజరయ్యారు. 

మరిన్ని వార్తలు