ఆ సిఫారసులు అమలు చేస్తే రూ.4 వేల కోట్ల అదనపు భారం

9 Apr, 2021 08:58 IST|Sakshi

ఆర్టీసీ సమ్మెతో ఎంత నష్టమో!

ట్రైనీలతో నడిపించే యత్నం..

10 శాతం జీతం పెంచుతాం..  

విధులకు రాకుంటే చర్యలు: సీఎం

సాక్షి, బెంగళూరు/బనశంకరి: ప్రజల సంచారానికి జీవనాడిగా పేరుపొందిన ఆర్టీసీ బస్సుల సమ్మెతో ప్రజలకు రవాణా వసతి బంద్‌ అయ్యింది. అదే మాదిరి ప్రభుత్వ ఆదాయం కూడా. ఇటీవల కోవిడ్‌ లాక్‌డౌన్, డిసెంబరులో ఆర్టీసీ సమ్మె వల్ల రూ. 16 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. కేఎస్‌ ఆర్టీసీ ఇప్పటికే నష్టాల్లో ఉండగా, ప్రస్తుతం బుధవారం నుంచి ఉద్యోగులు చేస్తున్న సమ్మెతో మరింత సంక్షోభంలోకి కూరుకుపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఆర్టీసీ సిబ్బంది వేతనాలకు నెలకు రూ.400 కోట్లు చెల్లిస్తున్నారు.

ఇక బస్సుల డీజిల్, నిర్వహణ కోసం రూ.300 నుంచి 400 కోట్లు ఖర్చుఅవుతుందని ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి  రవికుమార్‌ తెలిపారు. కానీ నెలవారీ ఆదాయం అంతమొత్తంలో లేదని ప్రభుత్వ వర్గాల కథనం. ఉద్యోగులు కోరుతున్నట్లు 6 వేతన కమిషన్‌ సిఫార్సుల్ని అమలు చేస్తే ఏడాదికి రూ.4 వేల కోట్ల అదనపు భారం పడుతుంది. కోవిడ్‌ వల్ల రద్దీ తగ్గడం, సమ్మె మూలంగా రోజుకు సుమారు రూ. 20 కోట్లకు పైగా నష్టం వస్తోందని అంచనా.  

కొనసాగుతున్న సమ్మె
వేతన కమిషన్‌ సిఫార్సుల ప్రకారం వేతనాలను పెంచాలనే డిమాండ్‌తో ఆర్టీసీ ఉద్యోగుల చేపట్టిన సమ్మె రెండవ రోజుకు చేరుకోగా ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. ప్రభుత్వం పట్టుదలతో శిక్షణలో ఉన్న డ్రైవర్లతో బస్సులు నడపడానికి గురువారం ప్రయత్నం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ప్రయాణ వసతి కరువై విలవిలలాడారు. బెంగళూరు సహా అనేక నగరాలు, పట్టణాల్లో ప్రైవేటు వాహనాలే రవాణా అవసరాలను తీర్చాయి.

లగేజ్, చిన్నపిల్లలను ఎత్తుకుని ప్రజలు బస్సులకోసం పడిగాపులు పడుతున్న దృశ్యాలు కనిపించాయి. కేఎస్‌ ఆర్‌టీసీ, బీఎంటీసీ ఉద్యోగులు ఇళ్లకే పరిమితం అయ్యారు. బెంగళూరు మెజస్టిక్, శాటిలైట్, యశవంతపురతో పాటు ప్రముఖ బస్టాండ్లు ప్రయాణికులు లేక బోసిపోయాయి. చాలాచోట్ల ప్రైవేటు బస్సులు కూడా తక్కువగా సంచరించాయి. ప్రైవేటు బస్సుల దొరుకుతాయనే ఆశతో వచ్చిన ప్రయాణికులు, ప్రజలు బస్సులు సకాలంలో దొరక్కపోవడంతో నిరాశచెందారు. ఉత్తర కర్ణాటక నగరాల్లో ప్రైవేటు బస్సులు సైతం అరకొరగా సంచరిస్తున్నాయి.  

ట్రైనీలతో నడిపించే యత్నం..  
సమ్మె నేపథ్యంలో శిక్షణలో ఉన్న డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు గురువారం తప్పనిసరిగా విధులకు హాజరుకావాలని బీఎంటీసీ ఆదేశించింది. విధులకు హాజరయ్యే సిబ్బందికి అన్ని విధాలా భద్రత కల్పిస్తామని కేఎస్‌ఆర్‌టీసీ డైరెక్టర్‌ శివయోగి కళసద్‌ తెలిపారు.  

నేడు కూడా సమ్మె 
డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే శుక్రవారం కూడా సమ్మె కొనసాగిస్తామని రవాణాశాఖ ఉద్యోగుల ఒక్కూట గౌరవాధ్యక్షుడు కోడిహళ్లి చంద్రశేఖర్‌ గురువారం తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆర్టీసీ సిబ్బందికి అత్యంత తక్కువ వేతనం వస్తోందని అన్నారు. ఈ తారతమ్య ధోరణి సరికాదన్నారు. విధులకు హాజరుకాకపోతే కఠినచర్యలు తీసుకుంటామని రవాణాశాఖ సిబ్బంది ఇళ్లకు నోటీసులు అంటించడం సరైన పద్ధతి కాదన్నారు.  

10 శాతం జీతం పెంచుతాం..  
6వ వేతన కమిషన్‌ సిఫార్సుల ప్రకారం వేతనాలను పెంచలేం, 8 శాతానికి బదులు 10 శాతం జీతం పెంచుతామని రవాణా శాఖ ప్రధాన కార్యదర్శి అంజుంపర్వేజ్‌ తెలిపారు. సమ్మె విరమించకపోతే ఎస్మా ప్రయోగిస్తామని చెప్పారు. సమ్మె వీడకపోతే రెండేళ్ల లోపు పదవీవిరమణ చేసిన ఆర్టీసీ సిబ్బందిని పిలిపించి బస్సులు నడిపిస్తామని పేర్కొన్నారు.  

విధులకు రాకుంటే చర్యలు: సీఎం 
రవాణాశాఖ ఉద్యోగులు డిమాండ్లను ప్రభుత్వం ఇప్పటికే నెరవేర్చింది. అయినా సమ్మె చేయడం సరికాదు. తక్షణం విధులకు హాజరుకావాలి, లేని పక్షంలో కఠినచర్యలు తీసుకుంటామని సీఎం యడియూరప్ప గురువారం హెచ్చరించారు. ఆయన బెళగావిలో మాట్లాడుతూ కోవిడ్‌ క్లిష్ట సమయంలోనూ 8 శాతం వేతనం పెంచాలని తీర్మానించామన్నారు. ఉద్యోగులు వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని విధుల్లో చేరాలన్నారు.  

చదవండి: ఆర్టీసీ సమ్మె: టికెట్‌ ధరకు రెట్టింపు వసూళ్లు!
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు