ఆర్టీసీ సమ్మె: టికెట్‌ ధరకు రెట్టింపు వసూళ్లు!

8 Apr, 2021 10:22 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: ఆరవ వేతన కమిషన్‌ సిఫార్సుల్ని అమలు చేయడంతో పాటు పలు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ ఉద్యోగులు బుధవారం నుంచి సమ్మె ప్రారంభించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి బస్సులు అక్కడే డిపోల్లో నిలిచిపోయాయి. 24 వేల బస్సుల సంచారం బందై బస్టాండ్లు నిర్మానుష్యమయ్యాయి. ప్రజలు గమ్యస్థానం చేరడం ఎలా అని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రోగులు, వృద్ధులు, చంటిపిల్లల తల్లుల బాధలు వర్ణనాతీతం. విద్యార్థులు, ఉద్యోగులు, కూలీలు గమ్యం చేరలేక నానా ఇబ్బందులు పడ్డారు. బుధవారం జరగాల్సిన బెంగళూరు, తుమకూరు, మంగళూరు, రాణిచెన్నమ్మ విశ్వవిద్యాలయ పరీక్షలను వాయిదా వేశారు. ఆర్టీసీ సమ్మెతో రాష్ట్రంలోని 31 జిల్లాల్లో రవాణా బస్సులు సంచారం పూర్తిగా స్తంభించిపోయింది.

కాగా, ప్రయాణ అవసరాల కోసం ప్రభుత్వం ప్రైవేటు బస్సులు, టెంపోలకు అనుమతి ఇచ్చింది. బెంగళూరుతో పాటు వివిధ జిల్లాల్లో ప్రైవేటు వాహనాలే ప్రజలకు దిక్కయ్యాయి. బెంగళూరులోని మెజెస్టిక్‌ బస్టాండు, కెంపేగౌడ బస్టాండు, శాటిలైట్, యశవంతపుర బస్టాండ్లులో ప్రైవేటు మినీబస్సుల సంచారం అధికమైంది. ఆటో, ట్యాక్సీ, ప్రైవేటు బస్సుల్లో కిక్కిరిసిన ప్రయాణాలు తప్పలేదు. దీనివల్ల కరోనా రెండో దాడి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన ఏర్పడింది. ప్రైవేటు వాహనాల్లో అధిక టికెట్‌ ధరలను వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. 

బస్టాండ్లలోకి ప్రైవేటు బస్సులు..  
బెంగళూరు నగరంలో ప్రైవేటు బస్సులు, మినీ బస్సులు బీఎంటీసీ రూట్లలో తిరిగాయి. అయితే టికెట్‌ ధరకు రెట్టింపు వసూళ్లు చేసినట్లు ప్రయాణికులు వాపోయారు. గత్యంతరం లేక ప్రైవేటు వాహనాలనే ఆశ్రయించారు. ఇక ట్యాక్సీ, ఆటోడ్రైవర్లు ఇదే అదనుగా విపరీతంగా చార్జీలు వసూలు చేశారు. మొత్తం మీద బెంగళూరుతో పాటు అనేక  ప్రాంతాల్లో ప్రైవేటు బస్సులు సంచారం తీవ్రతరమైంది. సాధారణంగా మెజెస్టిక్, కెంపేగౌడబస్టాండులోకి ప్రైవేటు బస్సులకు అనుమతిలేదు. కానీ బుధవారం అన్ని బస్టాండ్లలోకి స్వేచ్ఛగా ప్రైవేటు బస్సులు ప్రవేశించాయి. బెంగళూరు నుంచి రాష్ట్రంలో ప్రధాన నగరాలకు బస్సులు కరువయ్యాయి. సమ్మె వల్ల ఐటీ సిటీలో మెట్రోరైలు సర్వీసులను పెంచారు. మెట్రో స్టేషన్లలో రద్దీ ఏర్పడింది. మెట్రో టోకెన్లు దొరక్క ప్రజలు ఇబ్బందిపడ్డారు. సమ్మె ముగిసే వరకు టోకెన్‌ వ్యవస్థను కల్పించాలని ప్రజలు డిమాండ్‌ చేశారు. 

ప్రయాణికులకు కటకట..  
ప్రభుత్వం, రవాణా శాఖ ఉద్యోగులు పట్టువీడకపోవడంతో ప్రజలు నలిగిపోవాల్సి వచ్చింది. ఎంతో వెచ్చించి నెల పాస్‌ తీసుకుంటే ప్రైవేటు బస్సులు టెంపోలు, ఆటోల్లో డబ్బు పెట్టి ప్రయాణించాలా? అని పలువురు మండిపడ్డారు. మంగళవారం తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో పోలింగ్‌కు వెళ్లి తిరిగివచ్చే కర్ణాటక ఉద్యోగులకు బస్సులు దొరకలేదు. మైసూరునగర, గ్రామీణ బస్టాండ్లు వెలవెలబోయాయి. కరోనా వైరస్‌ ఉండటంతో ధర్నా చేపట్టరాదని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సర్కారు హెచ్చరించింది. దీంతో ఉద్యోగులు ధర్నాలకు దిగలేదు. 

చర్చిద్దాం రండి: సీఎం
సాక్షి, బళ్లారి: కేఎస్‌ఆర్‌టీసీ సిబ్బంది సమ్మె మానుకుని ప్రభుత్వంతో చర్చలకు రావాలని సీఎం యడియూరప్ప కోరారు. బుధవారం బెళగావిలో ఉప ఎన్నికల ప్రచారంలో విలేకరులతో మాట్లాడుతూ చర్చల్లో ఎవరితోనైనా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదన్నారు. ప్రభుత్వంతో చర్చలకు రాకుండా, సమ్మె మానకపోతే ఎస్మా ప్రయోగించేందుకు కూడా వెనుకాడేది లేదన్నారు. కరోనా కష్ట సమయంలోను, విద్యార్థులకు పరీక్షలు ఉన్నందున బంద్‌ పాటించడం తగదన్నారు.  

జీతాలకు కష్టమవుతుంది: డీసీఎం 
బనశంకరి: ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తే జీతాలివ్వడం కష్టమని డిప్యూటీ సీఎం లక్ష్మణసవది హెచ్చరించారు.  బీదర్‌లో విలేకరులతో మాట్లాడుతూ  రవాణాశాఖ నష్టాల్లో ఉందని ప్రతిరోజు రూ.4 కోట్లు నష్టం వస్తోందన్నారు. సమ్మె చేయడం వల్ల నష్టం మీకేనన్నారు. ప్రయాణికులను ఇబ్బందులు పెడుతూ సమ్మెకు దిగడం న్యాయమా అని ప్రశ్నించారు. రవాణాశాఖ ఉద్యోగులు పెట్టిన 9 డిమాండ్లలో 8 డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. సమ్మె వల్ల రోజూ 30 లక్షల మంది ప్రయాణికులు కష్టాల పాలవుతారన్నారు. 

చదవండి: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె.. ప్రభుత్వం కీలక నిర్ణయం

మరిన్ని వార్తలు