ఢిల్లీ చేరుకున్న కుంభ్‌ సందేశ్‌ యాత్ర

21 Mar, 2021 14:41 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడమే కాకుండా ప్రాముఖ్యతను కొత్త తరానికి చాటిచెప్పడం, గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధనకు ప్రజలు, మేధావుల నుంచి సలహాలు స్వీకరించేందుకు ప్రారంభమైన కుంభ్‌ సందేశ్‌ యాత్ర, మిషన్‌ 5151 బృందం దేశ రాజధానిలో అడుగుపెట్టింది. గత నెల 27న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన యాత్ర 7 రాష్ట్రాల్లో సుమారు 7వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి ఢిల్లీకి చేరుకుంది.

గ్రామోదయ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యాత్ర సుమారు 500 పట్టణాల ద్వారా సాగిందని జీకాట్‌ వ్యవస్థాపకుడు, కుంభ్‌ సందేశ్‌యాత్ర నిర్వహణ కార్యదర్శి ఢిల్లీ వసంత్‌ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లల్లో సన్నాహక యాత్ర జరిగిందన్నారు. సన్నాహక యాత్రను ఫిబ్రవరి 19న హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. అనంతరం తమిళనాడు కన్యాకుమారి దగ్గర త్రివేణి సంగమం నుంచి ఫిబ్రవరి 27న అధికారికంగా ప్రారంభమైన ఈ కుంభ్‌సందేశ్‌ యాత్ర కుంభమేళా జరిగే మొత్తం నాలుగు క్షేత్రాలు నాసిక్, ఉజ్జయిని, ప్రయాగరాజ్‌ మీదుగా ఢిల్లీకి చేరుకుంది.

ఢిల్లీలో రాబోయే రెండు మూడు రోజుల పాటు ఐఐటీ, ఐసీసీఆర్, ఐసీఏఆర్, జీజీఎఫ్, డబ్ల్యూసీఎఫ్, అంతర్జాతీయ సంస్థలు, రాయబార కార్యాలయాలు, వివిధ మంత్రిత్వ శాఖల అధికారులతో భేటీ అవుతామని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 24 న పాదయాత్ర ఢిల్లీ నుంచి హరిద్వార్‌ వరకు 250 కిలోమీటర్ల మేర పాదయాత్రను వారం రోజుల్లోగా పూర్తిచేస్తామని వసంత్‌ అన్నారు. హరిద్వార్‌కు చెందిన దివ్యప్రేమ సేవా మిషన్, ఢిల్లీకి చెందిన ఐఎస్‌ఆర్‌ఎన్, హైదరాబాద్‌కు చెందిన మాస్‌ సంస్థ, జేడీ ఫౌండేషన్, భారతీయం, ఇంపాక్ట్‌ ఫౌండేషన్, రెడ్డి జేఏసీ వంటి అనేక సంస్థలు ఈ సందేశ్‌ యాత్రకు సహాయపడుతున్నాయని వసంత్‌ తెలిపారు. హరిద్వార్‌లో అఖాడా పరిషత్‌లు, సామాజిక సంస్థలు, ఎన్జీఓలతో సమావేశమై చివరగా ప్రకటించే హరిద్వార్‌ డిక్లరేషన్‌ను యూఎన్‌ఓ, డబ్ల్యూహెచ్‌ఓ, రాష్ట్రపతి, ప్రధానితో పాటు సీఎంలకు అందిస్తామన్నారు.

>
మరిన్ని వార్తలు