కుంభమేళా ఎఫెక్ట్‌: ఒక్కరి వల్ల 33 మందికి కోవిడ్‌

13 May, 2021 15:35 IST|Sakshi

బెంగ‌ళూరు: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. ప్రతి రోజు లక్షల కొద్ది కేసులు నమోదవుతున్నాయి. సామాజిక దూరం పాటించండి, మాస్క్‌ ధరించండి అంటూ ప్రభుత్వాలు ఎంత మొత్తుకున్న వాటిని పట్టించుకోకుండా జనాలు అడ్డగోలుగా తిరుగుతున్నారు. ఉత్సవాలు, వేడుకలు నిర్వహించి.. కోవిడ్‌ వ్యాప్తిని పెంచుతున్నారు. తాజాగా కుంభ‌మేళాకు వెళ్లొచ్చిన ఓ మ‌హిళ‌.. మొత్తం 33 మందికి క‌రోనాను అంటించింది. బెంగ‌ళూరుకు చెందిన ఓ 67 ఏళ్ల మ‌హిళ ఉత్త‌రాఖండ్‌లో ఇటీవ‌ల జ‌రిగిన కుంభ‌మేళాకు వెళ్లొచ్చింది. తర్వాత కొద్ది రోజుల‌కే ఆమెకు క‌రోనా ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌పడ్డాయి. టెస్టు చేయించ‌గా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ఆ మ‌హిళ‌తో పాటు ఆమె కుటుంబంలోని మ‌రో 18 మందికి క‌రోనా వ్యాపించింది.

స‌ద‌రు మ‌హిళా కోడ‌లు.. వెస్ట్ బెంగ‌ళూరులోని స్పంద‌న హెల్త్‌కేర్ అండ్ రిహాబిలిటేషన్ సెంట‌ర్‌లో సైక్రియాటిస్టుగా ప‌ని చేస్తోంది. ఈ క్రమంలో ఆమె ద్వారా ఆ సెంట‌ర్‌లో ఉన్న 13 మంది రోగుల‌తో పాటు ఇద్ద‌రు సిబ్బందికి క‌రోనా వ్యాపించింది. అలా మొత్తం 33 మందికి క‌రోనా సోకింది. ఈ విష‌యం తెలుసుకున్న అధికారులు.. 67 ఏళ్ల మ‌హిళ నివాసంతో పాటు ఆ ప‌రిస‌రాల‌ను కంటైన్‌మెంట్ జోన్‌గా ప్ర‌క‌టించారు.

చదవండి: Kumbh Mela 2021: ‘కుంభమేళా’పై విమర్శల వెల్లువ 

మరిన్ని వార్తలు