‘నీలాంటి చెత్త కంటే నా బిడ్డ ఎంతో నయం’: మోదీ మార్ఫింగ్‌ వీడియోతో బుక్కైన కమెడియన్‌

6 May, 2022 11:25 IST|Sakshi

ఢిల్లీ: ప్రముఖ కమెడియన్‌ కునాల్‌ కమ్రా మరోసారి వివాదంలో నిలిచాడు. యూరప్‌ దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. తొలుత జర్మనీలో పర్యటించిన విషయం తెలిసిందే. బెర్లిన్‌లో ప్రవాస భారతీయులతో ముఖాముఖి జరిపిన వేళ.. ఓ చిన్నారి దేశ భక్తి గేయం అలరించగా.. మోదీ కూడా హుషారుగా ఆ చిన్నారితో గొంతు కలిపారు. 

హే జన్మభూమి భారత్‌ అంటూ ఆ చిన్నారి వీడియో వైరల్‌ కాగా.. దానిని ‘మెహెన్‌గయి దాయన్‌ ఖాయే జాట్‌ హై’ అంటూ మరో ఆడియో క్లిప్‌తో మార్ఫింగ్‌ చేశారు ఎవరో. ఈ వీడియో కమెడియన్‌  కునాల్‌ కమ్రా తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. అయితే ఆ పోస్ట్‌ చూసిన.. ఆ చిన్నారి తండ్రి తీవ్రంగా స్పందించాడు. 

చెత్త అంటూ కునాల్‌ను తిట్టిపోశాడు ఆ చిన్నారి తండ్రి గణేష్‌ పోల్‌. ఏడేళ్ల తన కొడుకు మాతృదేశం కోసం పాట పాడానని, అంత చిన్న వయసులో ఉన్నా చెత్త వెధవ అయిన నీ కంటే తన దేశాన్ని ప్రేమిస్తున్నాడంటూ ఆయనొక ట్వీట్‌ చేశాడు.  అంతేకాదు చిన్నపిల్లలతో కామెడీ ఏంటంటూ మండిపడ్డాడు. 

అయితే ఈ జోక్‌ అతని కొడుకు మీద వేసింది కాదంటూ కునాల్‌ కమ్రా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.  ఇదిలా ఉండగా.. నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌ (ఎన్‌సీపీసీఆర్‌) ఈ విషయమై కునాల్‌ మీద చర్యలకు సిద్ధమైంది. ట్వీట్‌ డిలీట్‌ చేయించడంతో పాటు కునాల్‌ మీద చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను గురువారం ఆదేశించింది. అయితే విమర్శలు తారాస్థాయికి చేరడంతో ఆ వీడియోను డిలీట్‌ చేశాడు కునాల్‌ కమ్రా.

చదవండి: ‘రాజద్రోహం’పై విస్తృత ధర్మాసనం అనవసరం

మరిన్ని వార్తలు